చైనాలోని ఒక జూలో అరుదైన గోల్డెన్ టైగర్ నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్ లోని తైహు లేక్ లాంగెమోంట్ ప్యారడైజ్ ఉద్యానవనంలో ఉన్న జూలో అక్టోబర్19న గోల్డెన్ టైగర్ ప్రసవించింది. 12 రోజుల వయసున్న మూడు ఆడ, ఒక మగ పులి పిల్లలు జూలో సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చైనా ప్రభుత్వానికి చెందిన అధికారిక మీడియా సంస్థ ఈ వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గోల్డెన్ టైగర్ చర్మంపై చారలు నలుపు రంగులో కాకుండా లేత బంగారు, ఎరుపు గోధుమ వర్ణంలో ఉంటాయి. రంగును ప్రభావితం చేసే జన్యువుల్లో మార్పుల వల్ల పులి చర్మంపై చారల రంగులు మారతాయి.
అరుదైన జాతి
గోల్డెన్ టైగర్లు అరుదుగా కనిపిస్తాయి. ఇవి ఒక ప్రత్యేకమైన జాతికి చెందినవి. జెయింట్ పాండాలకంటే కూడా గోల్డెన్ టైగర్ కు అరుదైన జాతిగా పేరుందని డైలీ మెయిల్ వార్తాసంస్థ చెబుతోంది. వీటి చర్మంపై వెంట్రుకలు, చారలు ఎరుపు-గోధుమ రంగుల్లో ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 వరకు మాత్రమే గోల్డెన్ టైగర్ జాతి పులులు ఉన్నట్టు అంచనా. ఇది మొత్తం జెయింట్ పాండాల సంఖ్య కంటే 62 రెట్లు తక్కువ.
జెనెటిక్ మ్యుటేషన్ కారణంగా...
పుట్టగానే పులి పిల్లలను తల్లి నుంచి వేరుచేశామని జూ అధికారులు చెబుతున్నారు. వాటి తల్లి మొదటిసారిగా ప్రసవించడంతో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. బెంగాల్ టైగర్ జాతి పులల జన్యు పరివర్తన (జెనెటిక్ మ్యుటేషన్) ద్వారా కొత్త రకం గోల్డెన్ టైగర్ జాతి పులులను సృష్టించినట్టు జూ అధికారులు వెల్లడించారు. వీటిల్లో సంతానోత్పత్తి రేటు చాలా తక్కువగా ఉంటుంది.
Zoo in E China's Zhejiang welcomes four adorable golden tiger cubs. Known for its blonde or pale-golden color and red-brown (not black) stripes, a golden tiger is a tiger with a color variation caused by a recessive gene. pic.twitter.com/8P2qJpYy0S
— People's Daily, China (@PDChina) October 30, 2020
మన దేశంలో ఒక్కటే ఉంది..
ఈ జులైలో మన దేశంలోని కజిరంగ నేషనల్ పార్క్ లో ఒక గోల్డెన్ టైగర్ ను అధికారులు గుర్తించారు. ఇది ప్రస్తుతం భారతదేశంలో సజీవంగా ఉన్న ఒకే ఒక్క గోల్డెన్ టైగర్ కావడం విశేషం. ఈ పులి ఫోటోలను IFS అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో పంచుకున్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేష్ హెండ్రే ఆ పులిని ఫోటోలు తీశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger