రాజకీయా వార్తలను ఫాలో అయ్యేవారికి ఆయన పేరు తెలియకుండా ఉండదు.. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన ఆయన.. అనంతపురం జిల్లాలో తిరుగులేని నాయకుడు.. ఏడాదిన్నర ముందు వరకు ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు.. అప్పట్లో అన్నింటా చక్రం తిప్పిన ఆయన.. ఇప్పుడిలా సొంత ఇంట్లోనే బందీ అయిపోయారు.. అవును, ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డిని ఆయన ఇంట్లోనే తాళ్లతో బంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ దృశ్యం వెనుక కథ మాత్రం కాస్త ఫన్నీగా ఉంటుంది..
పదవిలో ఉన్నా, లేకున్నా హంగూ, ఆర్భాటాల్లో ఏమాత్రం తగ్గరు రాజకీయ నేతలు. అలాంటిది సంపదలోనే పుట్టి పెరిగి, ఏకంగా పదేళ్ల పాటు మంత్రిగిరి చేసి, అన్ని ప్రాంతాల్లో తనకంటూ అనుచరులను కలిగుండి, పక్కరాష్ట్రాలు, విదేశాల్లోనూ ఇమేజ్ ఉన్నా మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాత్రం అతిసాధారణంగా కనిపిస్తారు. ఇంట్లో ఖరీదైన కార్లు ఉన్నా, ఆయన మాత్రం పక్కా పల్లెటూరి రైతులా మోపెడ్ పై తిరుగుతూంటారు. ఆ మధ్య రఘువీరా భార్యతో కలిసి మోపెడ్ పై తిరుగుతోన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడేమో ఆయనను కట్టేసిన ఫొటోల వంతు..
Annoyed that I haven’t spent enough time with her, my grand daughter Samaira tied me up to a pillar and demanded that I stay at home to play with her. pic.twitter.com/JISjujg8GV
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) November 2, 2021
రాజకీయాలను పక్కన పెట్టి, వ్యవసాయ జీవితాన్ని గడుపుతోన్న రఘువీరా.. తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. తాళ్లతో కట్టేసి ఉన్న ఫొటోను ఆయన స్వయంగా షేర్ చేశారు. ఇంతకీ అంతటి నేతను కట్టేసింది మరెవరో కాదు.. ఆయన మనవరాలే. అవును, పొలం పనులు, ఊరి పంచాయితీలతో తీరిక లేకుండా తిరుగుతోన్న తాతతో ఆడుకోడానికి ఆ మనవరాలికి వీలు చిక్కట్లేదట. అందుకే తాతగారిని ఇలా ఇంట్లోనే కట్టేసింది. ‘తనతో ఆడుకునే సమయం ఇవ్వట్లేదని నా మనవరాలు నన్నిలా స్తంభానికి కట్టేసింది..’అంటూ రఘువీరా ఈ ఫొటోను షేర్ చేశారు. సరదాగా ఉందికదా ఈ తాతామనవరాళ్ల ఆట..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Raghuveera Reddy, Viral photo