Gujarat employee: ‘నేను దేవుణ్ని.. నా గ్రాట్యుటీ ఇవ్వండి.. లేకపోతే...’ గుజరాత్‌లో మాజీ ఉద్యోగి హల్‌చల్

ప్రతీకాత్మకచిత్రం

ర‌మేష్‌చంద్ర ఫెఫ‌ర్ మాన‌సిక స్థితి స‌రిగా లేక‌పోవ‌డం, ఆయ‌న త‌న‌ను తాను విష్ణుమూర్తి అవ‌తారంగా భావించ‌డం, ఆఫీసుకు స‌రిగా రాక‌పోవ‌డంతో ఆయ‌న ప్రీమెచ్యూర్ రిటైర్‌మెంట్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

  • Share this:
గుజ‌రాత్ ప్ర‌భుత్వ మాజీ ఉద్యోగి ర‌మేష్‌చంద్ర ఫెఫ‌ర్ మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. త‌నను తాను సాక్షాత్తూ విష్ణుమూర్తి స్వ‌రూప‌ంగా భావించి ఉద్యోగానికి గైర్హాజ‌రైన ఈయ‌న ముందస్తు రిటైర్‌మెంట్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త‌న‌కు రావాల్సిన గ్రాట్యూటీ, ఏడాది జీతం వెంట‌నే ఇవ్వ‌క‌పోతే ప్ర‌పంచాన్ని క‌రువుకాటుకు బ‌లి చేస్తానంటూ హంగామా చేస్తున్నారు. ర‌మేష్‌చంద్ర ఫెఫ‌ర్ మాన‌సిక స్థితి స‌రిగా లేక‌పోవ‌డం, ఆయ‌న త‌న‌ను తాను విష్ణుమూర్తి అవ‌తారంగా భావించ‌డం, ఆఫీసుకు స‌రిగా రాక‌పోవ‌డంతో ఆయ‌న ప్రీమెచ్యూర్ రిటైర్‌మెంట్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో జులై 1న రామ‌చంద్ర గుజ‌రాత్ జ‌ల‌వ‌న‌రుల శాఖ కార్య‌ద‌ర్శికి ఆయన ఒక లేఖ రాశారు. ప్ర‌భుత్వంలో దెయ్యాలు కూర్చుని త‌న‌ను వేధిస్తున్నాయ‌ని, త‌న గ్రాట్యూటీ రూ.16ల‌క్ష‌లు, ఏడాది జీతం రూ.16లక్ష‌లు రాకుండా అడ్డుకుంటున్నాయ‌ని చెప్పారు.

త‌న‌కు రావాల్సిన మొత్తం ఇవ్వ‌క‌పోతే ప్ర‌పంచ‌మంతా క‌రువుకాట‌కాలు సృష్టిస్తానన్నారు. తాను విష్ణుమూర్తి ప‌దో అవ‌తార‌మైన క‌ల్కి అవ‌తారం కాబట్టి.. ఆ శక్తి తనకు ఉందంటున్నారు. ర‌మేష్‌చంద్ర‌ ఆఫీసుకు హాజ‌రుకాకుండానే జీతం అడుగుతున్నారని, పైగా క‌ల్కి అవ‌తారం, కరవు అంటూ జీతం చెల్లించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారని జ‌ల‌వ‌న‌రుల‌శాఖ కార్య‌ద‌ర్శి ఎంకె జాద‌వ్ చెప్పారు. ‘గ్రాట్యూటీ ప్రాసెస్‌లో ఉంది. ఆయ‌న‌పై ఒక విచార‌ణ పెండింగ్‌లో ఉంది. సాధారణంగా విచార‌ణ‌లు పూర్తికాకుండా ప్ర‌భుత్వం ముంద‌స్తు రిటైర్‌మెంట్‌కు అనుమ‌తించ‌దు. కానీ ర‌మేష్‌చంద్ర మాన‌సిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయ‌న ముందుస్తు రిటైర్‌మెంట్‌కు అనుమ‌తిచ్చింది’ అని జాద‌వ్ చెప్పారు.

ఇక ర‌మేష్‌చంద్ర రాసిన లేఖ‌లో గ‌త రెండు ద‌శాబ్దాలుగా దేశంలో మంచి వ‌ర్ష‌పాతం న‌మోదు కావ‌డానికి త‌న క‌ల్కి అవ‌తార‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ‘గ‌డిచిన రెండు ద‌శాబ్దాల‌లో ఇండియా రూ.20ల‌క్ష‌ల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదంతా నా మ‌హిమే. ఇంత చేస్తుంటే ప్ర‌భుత్వంలో దెయ్యాలు కూర్చుని న‌న్ను వేధిస్తున్నాయి. అందుకే ప్ర‌పంచ‌మంతా క‌రువును తీసుకువ‌స్తా. స‌త్య‌యుగంలో ధ‌ర‌ణిని ఏలేది నేనే’ అంటూ ముక్తాయించారు.

ర‌మేష్‌చంద్ర ముంద‌స్తు రిటైర్‌మెంట్ తీసుకోవ‌డానికి ముందు గుజరాత్ జ‌ల‌వ‌న‌రుల శాఖకు చెందిన స‌ర్దార్ స‌రోవ‌ర్ పునరావాస ఏజెన్సీకి సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్‌గా నియ‌మితుల‌య్యారు. త‌న‌ను తాను విష్ణుమూర్తి అవ‌తారంగా పేర్కొంటూ ఏడాదికి కేవ‌లం 16 రోజులు మాత్ర‌మే ఆఫీసుకు హాజ‌ర‌వ‌డంపై 2018లో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ అయింది. తరువాత ఆయన మాన‌సిక ఆరోగ్యం దృష్ట్యా ప్ర‌భుత్వం ముంద‌స్తు ఉద్యోగ విర‌మ‌ణ‌కు అంగీక‌రించింది.
Published by:Krishna Adithya
First published: