Ford Emoji Biking Jacket : రోడ్లపై రకరకాల వాహనాలు వెళ్తుంటాయి. సైకిల్ మొదలు... లారీ వరకూ ఎన్నో. ఐతే... కారులో ఇతర వాహనాల్లో వెళ్లేవారికి సేఫ్టీ మెజర్స్ ఎక్కువగానే ఉంటాయి. ఐతే... సైకిల్‌పై వెళ్లేవారికి మాత్రం ఏవీ ఉండవు. ఏ వాహనమో ఢీ కొడితే... సైకిల్ నడిపేవారు గాయాలపాలవడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతోంది. ఇది ఇండియాలోనే కాదు... ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కనిపిస్తున్న సమస్యే. ముఖ్యంగా... అమెరికాలో ఇదో పెద్ద సమస్య అయ్యింది. ఏటా ట్రాఫిక్స్ యాక్సిడెంట్లలో సైక్లిస్టులే ప్రాణాలు కోల్పోతున్నారు. 2017లో కంటే 2018లో సైకిల్ ప్రమాదాల సంఖ్య 6.3 శాతం పెరిగి... 51 మంది చనిపోయినట్లైంది. యూరప్ దేశాల్లో 2010 నుంచీ 2018 మధ్య 19,450 మంది సైకిల్స్ నడిపేవారు చనిపోయారు. సాధారణంగా అతివేగం ప్రామాదాలకు కారణమవుతుంది. కానీ సైకిల్స్ నడిపేవారు నెమ్మదిగానే వెళ్తారు కదా. మరి వాళ్లెందుకు చనిపోతున్నారు అని ఆటోమొబైల్ కంపెనీలు ఆలోచించాయి. ప్రధానంగా సైకిల్స్ నడిపేవారు... ఎప్పుడు ఎటువైపు సైకిల్ డ్రైవ్ చేస్తారన్నది వెనక వచ్చే వాహనదారులకు తెలియట్లేదు. ఏ కారో అయితే సైడ్ లైడ్స్ ఆన్ చేయడం ద్వారా... కారు రైట్కో, లెఫ్ట్కో టర్న్ తిరుగుతుందని అర్థమవుతుంది. సైకిళ్ల విషయంలో అలా తెలియట్లేదు. అందువల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ విషయాన్ని కనిపెట్టిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్... సరికొత్త ఇమోజీ బైకింగ్ జాకెట్ తెచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే... ఈ జాకెట్ వల్ల సైకిల్ నడిపేవారు... వెనక వచ్చే వాహనదారులకు తమ డ్రైవింగ్ వివరాలన్నీ చెప్పగలరు. అంటే... సిగ్నల్ దగ్గర సైకిల్ ఆగినా, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, బ్రేక్ వేసినా ఇలా ప్రతి దానికీ ఓ సింబల్... సైక్లిస్ వేసుకున్న జాకెట్ వెనక కనిపిస్తుంది. ఏ ప్రాబ్లమూ లేకుండా సైకిల్ నడుపుతూ ఉంటే... స్మైలీ ఇమోజీ కనిపిస్తుంది. ఏదైనా సమస్య వస్తే... శాడ్ ఇమోజీ ప్రత్యక్షమవుతుంది. ఈ ఇమోజీలు, సిగ్నల్స్ ఆధారంగా వెనక వాహనాల్లో డ్రైవ్ చేసేవారికి... ఎదురుగా ఉన్న సైక్లిస్ట్ ఎటు వెళ్లేదీ అర్థమై... ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గిపోతాయి.
ఈ ప్రోటోటైప్ జాకెట్ వెనక LED లైట్లను అమర్చారు. వీటి నుంచీ వైర్లెస్ రిమోట్‌ని సైక్లిట్స్ హ్యాండిల్‌కి సెట్ చేశారు. అందువల్ల సైక్లిస్ట్ తన సంకేతాల్ని ఈ లైట్ల ద్వారా వెనక వచ్చే వారికి చెప్పవచ్చు. అందువల్ల వెనక వాహనదారులు జాగ్రత్త పడి... ఆ ప్రకారం తమ వాహనాల్ని నడిపేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఈ కొత్త జాకెట్‌పై ఫోర్డ్... సైకిల్ కంపెనీలు, డిజైనర్లతో కలిసి పనిచేస్తోంది. రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్‌లో భాగంగా దీన్ని ఇప్పటికే ప్రదర్శిస్తున్నారు. త్వరలోనే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఇది వస్తే... రోడ్డు ప్రమాదాలకు చాలా వరకూ బ్రేక్ పడుతుందంటున్నారు సైక్లిస్టులు.
Published by:Krishna Kumar N
First published:February 07, 2020, 10:55 IST