కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భూగోళాన్ని చుట్టుముట్టగా ప్రపంచ దేశాలన్నీ కఠిన ఆంక్షల మధ్య కొత్త ఏడాది 2022కు స్వాగతం పలికాయి. అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో దాదాపు లాక్ డౌన్ తరహా ఆంక్షలుండగా, భారత్ లోనూ చాలా రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు రద్దయ్యాయి. జనం చాలా వరకు ఇళ్లలోనే లేదా తమ వీధుల్లోనే వేడుకలకు పరిమితం అయ్యారు. అయితే ఈసారి అత్యంత ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగింది మాత్రం స్పేస్ లోనే. అవును, ఖగోళ చరిత్రలో తొలిసారి మనవులు అంతరిక్షంలో కొత్త ఏడుకు స్వాగతం పలుకుతూ సంబురాలు చేసుకున్నారు. భూమికి 400పైచిలకు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న రెండు అంతరిక్ష కేంద్రాల్లో ఒకే సారి పది మంది వ్యోమగాములు న్యూ ఇయర్ పార్టీలు చేసుకుని రికార్డు నెలకొల్పారు. ఆ పది మందిలో తెలుగు మూలాలు కలిగిన రాజా చారి కూడా ఒకరు. వివరాలివి..
అమెరికా, రష్యా ప్రధానంగా, ప్రపంచ దేశాల భాగస్వామ్యంతో నడిచే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) భూమికి 403 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తుండటం, చైనా సొంతగా నిర్మించుకున్న తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం భూమికి 425 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుండటం తెలిసిందే. ఖగోళ పరిశోధనల్లో కీలక పాత్ర పోశిస్తోన్న ఈ రెండు అంతరిక్ష కేంద్రాల్లో కలిపి ప్రస్తుతం 10 మంది వ్యోమగాములున్నారు. వీరంతా శనివారం నాడు ఒకే సమయంలో న్యూ ఇయర్ సంబురాలు జరుపుకోవడం ద్వారా అంతరిక్షంలో అతిపెద్ద వేడుకలో పాల్గొన్న రికార్డును సాధించారు. స్పేస్ లో ఒకేసారి ఇంత మంది ఇంత మంది న్యూ ఇయర్ వేడుకలో పాల్గొనడం ఇదే తొలిసారి.
రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మోస్ శనివారం నాడు సంబంధిత ఫొటోలను విడుదల చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎన్ఎస్)లో ఏడుగురు వ్యోమగాములు, చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో ముగ్గురు వ్యోమగాములు.. మొత్తం పది మంది 2022కు ఒకేసారి స్వాగతం పలికారు. రోస్కాస్మోస్ ప్రకటన ప్రకారం, గడిచిన 21 ఏళ్లలో 83 మంది వ్యోమగాములు అంతర్జాతీయ స్పేస్ సెంటర్ లో కొత్త ఏడాది సంబురాలు చేసుకున్నారు. రష్యన్ ఆస్ట్రోనాట్ ప్లెరోవ్ ఏకంగా నాలుగు సార్లు (2012, 2015, 2018, 2022) న్యూ ఇయర్ వేడుకలను స్పేస్ లోనే జరుపుకొన్నాడు.
అంతరిక్షంలో 2022 కొత్త ఏడాదికి స్వాగతం పలికిన వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన, అందునా తెలుగు మూలాలున్న రాజాచారి కూడా ఉన్నారు. ఐఎన్ఎస్ లో రాజాచారితోపాటు నాసాకు చెందిన మరో ముగ్గురు, రోస్కాస్మోస్ కు చెందిన ఇద్దరు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఒకరు ఉన్నారు. తియాంగాంగ్ స్సేస్ స్టేషన్ లో ఉన్న ముగ్గురూ చైనీయులే.
భారతీయ అమెరికన్ అయిన రాజాచారి అమెరికా వాయుసేనలో కల్నల్ హోదాలో పనిచేశారు. ఆయన తండ్రి శ్రీనివాస్ చారి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా. రాజాచారి తాత హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. అదే వర్సిటీ నుంచి శ్రీనివాస్ చారి ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ పెగ్గీ ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నారు. వీరికి 1977 జూన్ 24న రాజాచారి జన్మించారు. ఆయన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికా నౌకాదళ టెస్ట్ పైలట్ స్కూల్లో తర్ఫీదు పొందారు. 2017లో నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు. తాను ఇప్పటివరకూ మూడుసార్లు హైదరాబాద్ వచ్చానని రాజాచారి ఒక సందర్భంలో చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New Year 2022, Space