పుణెలోని ఓ రెస్టారెంట్ వినూత్న ఆలోచన చేసింది. కస్టమర్లను ఆకర్షించేందుకు సూపర్ పోటీని పెట్టింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకొని వ్యాపారాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు ఈ ఆలోచన చేసింది. భారీ భోజనం పూర్తి చేసిన వారికి బుల్లెట్ బైక్ ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ తెచ్చింది పుణెలోని శివాజీ హోటల్.
ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ గెలుచుకోవాలంటే ఒక్క నిబంధన పెట్టింది. 60 నిమిషాల్లో 4కిలోల నాన్‌వెజ్ భోజనాన్ని పూర్తిగా తినాలి. ఇలా చేస్తే విజేతకు రూ.1.65లక్షలు విలువ చేసే బుల్లెట్‌ను బహుమతిగా ఇస్తోంది. ఎక్కువ మంది హోటల్‌కు వచ్చి తినేందుకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చామని రెస్టారెంట్ యజమాని అతుల్ వాకర్ చెప్పారు. పుణెలోని వాడ్గావ్ మావల్ ప్రాంతంలో ఈ హోటల్ ఉంది.
ఈ పోటీ కోసం ఐదు కొత్త బుల్లెట్ బైక్‌లను రెస్టారెంట్లో సిద్ధంగా ఉంచారు. బ్యానర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు బుల్లెట్ భోజనంలో ఏమేం ఉంటాయో మెనూ సైతం పెట్టారు. నిబంధనలు కూడా ప్రస్తావించారు.
ఈ భోజనంలో మొత్తం 12 రకాల వంటకాలు 4కేజీల బరువుతో ఉంటాయి. ఫ్రైడ్ సుర్మై, పొంఫ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరి, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ.. మరికొన్ని ఉన్నాయి.
ఈ కాంటెస్ట్‌కు మంచి స్పందన వస్తోందని, చాలా మంది పాల్గొంటున్నారని యజమాని అతుల్ వైకర్ చెప్పారు. కాగా ఈ బుల్లెట్ భోజనం ధర రూ.2500.
ఇప్పటి వరకు ఈ పోటీలో గెలిచి ఒక్కరు బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్నారట. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన సోమ్‌నాథ్ పవర్ అనే వ్యక్తి గెలువగా.. రెస్టారెంట్ యాజమాన్యం రాయల్ ఎన్ఫీల్డ్ను అందించింది.