కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్లు చేస్తోన్న కృషి అంతా ఇంతా కాదు. వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూనే కరోనా కట్టడికి పనిచేస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది ఎనలేని సేవలు చేస్తున్నారు. తమ విధులు నిర్వహించడమే కాదు.. మానవత్వం చాటుకోవడంలోనూ ముందుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో విధించిన నైట్ కర్ఫ్యూలో భాగంగా విధులు నిర్వర్తిస్తోన్న ఓ పోలీసు అధికారి ఓ మూగజీవం పట్ల మానవత్వం చాటుకున్నాడు. రాత్రి సమయంలో ఆయన విధులు నిర్వర్తిస్తుండగా.. ఓ కుక్క సమీపంలోని బోర్ వద్దకు వచ్చి నీరు తాగేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ పంప్ కొట్టే వారు లేక దిక్కులు చూస్తూ నిల్చుంది. దీన్ని గమనించిన సదరు పోలీసు అధికారి బోరింగ్ దగ్గరికి వెళ్లి పంప్ కొడుతూ దాని దాహం తీర్చాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను ఐపీఎస్ అధికారి సుకీర్తి మాధవ్ తన ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు.
ఈ ఫోటోను ఉదహరిస్తూ ప్రముఖ వెబ్ సిరీస్ ‘పాటల్ లోక్’ నుంచి ఒక డైలాగ్‌ను సుకీర్తి మాధవ్ పేర్కొన్నారు. “ఒక మనిషి కుక్కలను ప్రేమిస్తే, వారు మంచి మనిషి. అదే కుక్కలు మనుషులని ప్రేమిస్తే, వారు మానవత్వం ఉన్న మనిషి! ఇంక్రెడిబుల్ బనారస్ ..! ” అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. మూగజీవం దాహం తీర్చిన సదరు పోలీసు అధికారిని.. ‘సెల్యూట్ సర్’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ప్రశంసిస్తున్న నెటిజన్లు..
ఇలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లోనూ జరిగింది. మధ్యప్రదేశ్ సైలానాకు చెందిన శివమంగల్ సెంగర్ అనే ఓ పోలీసు అధికారి ఓ పిల్లవాడి పట్ల తన ఉదారత చాటుకున్నాడు. మండుటెండలో మాస్క్ అమ్ముతున్న పిల్లవాడిని చూసి చలించిపోయాడు. బాలుడి వద్ద ఉన్న అన్ని మాస్క్‌లను తానే కొనుగోలు చేసి.. గిరిజనులకు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా నుంచి రక్షణ పొందడంలో మాస్క్‌లు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. శివమంగల్ చేసిన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Varanasi