FARMERS USE HELICOPTER TO DRY CHERRY FRUIT CROPS AFTER RAINING VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SK
Agriculture: పొలంపై హెలికాప్టర్లను తిప్పితేనే.. ఈ పంట పండుతుంది.. లేదంటే సర్వనాశనం
చెర్రీ పంటపై హెలికాప్టర్
Helicopter drying Cherry Farm: వర్షం కురుస్తుందని తెలియగానే రైతులు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతారు. వర్షం నిలిచిన వెంటనే.. ఆ పొలంపై హెలికాప్టర్లను తిప్పుతారు. హెలికాప్టర్ రెక్కల నుంచి గాలి వల్ల చెర్రీ చెట్లపై ఉన్న నీరుంతా ఆరిపోతుంది.
ఈ భూ ప్రపంచంలో ఎన్నో రకాల పంటలు పండతాయి. ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణం, నేల పరిస్థితులను బట్టి పంటలు కూడా మారుతుంటాయి. కొన్ని చోట్ల వరి బాగా పండితే.. మరికొన్ని చోట్ల పత్తి బాగా దిగుబడి వస్తుంది. కొన్ని రకాల పండ్లు, పూలు.. అంతటా పండవు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులున్న చోటే పండుతాయి. వరి పంటలకు ఎప్పుడూ నీరుండాలి. కానీ కొన్ని పంటలకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. సాధారణంగా వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి. కొన్ని మాత్రం వర్షాల వల్లే నాశనం అవుతాయి. అలాంటి ఓ పండు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పంటపై అధిక వర్షం పడితే.. రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఏకంగా హెలికాప్టర్లనే రంగంలోకి దించాలి. హెలికాప్టర్ (Helicopters in Agriculture)లు చక్కర్లు కొడితేనే.. పంటల చేతికి వస్తుంది. లేదంటే సర్వనాశనం అవుతుంది.
చెర్రీ పండ్ల(Cherry Fruits)ను కేక్లపై గార్నిష్ చేయడం చూస్తుటా. పలు రకాల ఆహార పదార్థాల్లో కూడా వీటిని వినియోగిస్తారు. మార్కెట్లో మనకు ఈజీగా దొరికే ఈ పండును.. పండిచడం మాత్రం అంత సులభం కాదు. చాలా కష్ట పడాలి. ఈ చెర్రీ పంట పండేందుకు ఎక్కువ నీరు అవసరం లేదు. తక్కువ నీటితోనే సాగుచేయవచ్చు. ఒక వేళ వర్షం పడితే.. పంట మొత్తనం నాశనం అవుతుంది. అందుకే చెర్రీ రైతులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
చెర్రీ పండ్లు (Cherry Farming) పొడి వాతావరణంలోనే బాగా పండతాయి. వర్షాలు ఎక్కువగా పడే చోట ఈ పండ్ల సాగు సాధ్యం కాదు. ఎందుకంటే వర్షం పడితే ఈ పంట మొత్తం పాడైపోతుంది. వర్షం పడిన తర్వాత.. వర్షపు నీరంతా మొక్కలతో పాటు పండ్లపై నిలిచిపోతుంది. వర్షపు నీటిని చెర్రీ పండ్లు చాలా త్వరగా లోపలికి పీల్చుకుంటాయి. తద్వారా చెర్రీ లోపలి గుజ్జు అకస్మాత్తుగా ఉబ్బుతుంది. కానీ బయటి చర్మం మాత్రం సాగలేదు. ఈ పరిస్థితుల్లో పండ్లు పగిలిపోతాయి. అందుకే వర్షం పడిన తర్వాత చెర్రీ పండ్లు ఎక్కువగా డ్యామేట్ అవుతుంటాయి. అలాంటి పండ్లు నిరూపయోగంగా మారుతాయి. జ్యూస్ చేసేందుకు తప్ప దేనికీ పనికి రావు. వారు కూడా తక్కువ ధరకే కొంటారు. పైగా ఈ పగిలిపోయిన పండ్లను చెట్టు నుంచి తీసేందుకు కూలీ ఖర్చులు కూడా ఎక్కువవుతాయి. తద్వారా రైతులకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది.
అందుకే వర్షం నుంచి చెర్రీ పంటను కాపాడుకునేందుకు చాలా మంది రైతులు హెలికాప్టర్లను వినియోగిస్తారు. వర్షం పడితే చెర్రీ చెట్లు, పండ్లపై నీరు నిలిచిపోతుంది. వర్షం కురుస్తుందని తెలియగానే రైతులు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతారు. వర్షం నిలిచిన వెంటనే.. ఆ పొలంపై హెలికాప్టర్లను తిప్పుతారు. హెలికాప్టర్ రెక్కల నుంచి గాలి వల్ల చెర్రీ చెట్లపై ఉన్న నీరుంతా (Helicopter drying Cherry Farm) ఆరిపోతుంది. అప్పుడు పండ్లకు ఎలాంటి హాని జరగదు. ఐతే హెలికాప్టర్ల వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. హెలికాప్టర్ రెక్కల నుంచి అధిక గాలి వస్తే.. మొదటికే మోసం వస్తుంది. చెట్లు పాడవుతాయి. అందుకే చిన్న హెలికాప్టర్లను నిర్ధిష్టమైన ఎత్తులోనే పంట పొలాలపై తిప్పుతూ ఉండాలి. అప్పుడే చెర్రీ పండను కాపాడుకోగలుగుతారు. బ్రిటిష్ కొలంబియాలో చాలా ప్రాంతాల్లో చెర్రీ సాగులో ఇలా హెలికాప్టర్లను వినియోగిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.