కేంద్ర ప్రభుత్వం ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ల వినియోగం కోసం కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను అమలుచేసిందని పేర్కొంటూ ఒక సందేశం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. భారత ప్రభుత్వం అన్ని రకాల ఆన్లైన్, టెలిఫోనిక్ సమాచార మార్పిడిని పర్యవేక్షిస్తున్నదని.. రాజకీయాల గురించి గానీ, మతం లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ ఎవరైనా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా వారిని వారెంట్ లేకుండానే అరెస్టు చేస్తున్నారని సదరు సందేశం యొక్క సారాంశం. ఇది నిజమేనా..? మీరు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల పర్యవేక్షణలో ఉన్నారా..? మీ కాల్స్ ను వాళ్లు వింటున్నారా..? మీకు ప్రైవసీ లేదా..? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త నిజమేనా..?
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని ఫోన్ కాల్స్ ను తనిఖీ చేస్తున్నదని.. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వేదికలలో ఒక మెసేజ్ సర్క్యూలేట్ అవుతున్నది. ఈ మేరకు కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను జారీ చేసిందని.. వాటిని పాటించకపోతే వారిపై కఠిన చర్యలుంటాయన్నది దాని సారాంశం. దీనిపై ప్రభుత్వం యొక్క నిజ నిర్ధారణ వేదిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. దీని మీద నిజానిజాలను బహిర్గతం చేసింది.
పీఐబీ ప్రకారం.. ప్రభుత్వం ఇలాంటి నిబంధనలేమీ జారీ చేయలేదని తెలిపింది. ఇది నకిలీ వార్త (ఫేక్ న్యూస్) అని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పలువురు ఆకతాయిలు చేసిన పనిగా దీనిని అభివర్ణించింది. గతంలో పలుమార్లు, గతేడాది లాక్డౌన్ సమయంలో కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ సామాజిక మాధ్యమాలలో విరివిగా సర్క్యులేట్ అయ్యాయని.. కానీ వాటిలో నిజం లేదని స్పష్టతనిచ్చింది.
दावा: एक #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि केंद्र सरकार ने व्हाट्सएप्प और फोन कॉल के लिए नए संचार नियम लागू किए हैं। #PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। केंद्र सरकार ने व्हाट्सएप्प व फोन कॉल के संबंध में नए संचार नियम लागू करने की ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/5D7v8xthc0
— PIB Fact Check (@PIBFactCheck) January 29, 2021
అంతేగాక కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని పీఐబీ తెలిపింది. ప్రజల ప్రైవసీ ప్రభుత్వ బాధ్యత అని.. దానిని దుర్వినియోగపరిచే ఉద్దేశం ఎవరికీ లేదని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసింది పీఐబీ. ఇంటర్నెట్ లో తప్పుడు సమాచారం కుప్పలుతెప్పలుగా వస్తున్న నేపథ్యంలో 2019 డిసెంబర్ లో పీఐబీ ఈ ఫ్యాక్ట్ చెక్ ను ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో చక్కర్లు కొట్టే సందేశాల మీద ప్రజలెవరైనా పీఐబీకి పంపి.. వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Fact Check, Fake news, Social Media