ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సూపర్ హీరోలు రావడం సాధారణమే. అయితే అవి కామిక్స్, సినిమాల్లో జరుగుతుంటాయి. కానీ నిజ జీవితంలో వస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అవును క్యాపిటల్ భవనంలో(US Capitol Hill) ట్రంప్ మద్దతుదారులు చొచ్చుకోని పోయే ఆందోళన చేస్తున్న సమయంలో బ్యాట్ మ్యాన్ వచ్చాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బ్యాట్ మ్యాన్ వేషంలో కనిపించిన వీడియోలో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇది ఫేక్ వీడియో అని తర్వాత తేలింది. ఇది ఇప్పటి వీడియో కాదు.. గతేడాది బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ ప్రోటెస్ట్స్ కు చెందినది. అయితే ఈ వీడియో చూసినంత సేపు బ్యాట్ మ్యాన్ నిజంగానే రక్షిస్తాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో క్యాపిటల్ భవనలో జరిగిన ఆందోళన సర్వత్రా చర్చానీయాంశమైంది.
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మద్దతుదారులు ప్రవర్తించారు. యూఎస్ క్యాపిటల్ భవంలోకి చొచ్చుకొని వెళ్లి ట్రంప్ కు మద్దతు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 6 బుధవారం నాడు జరిగిన సంఘటన పట్ల ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీతో పాటు అధికార పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. ఈ ఆందోళనకు చెందిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తున్నాయి. నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించడానికి బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కాంగ్రెస్ ఉభయసభల సమావేశాన్ని అడ్డుకునేందుకు వారు ఈ దాడికి తెగబడ్డారు. అత్యంత ఉద్రిక్త వాతావరణంలోనే బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించింది.
తొలుత వేల సంఖ్యలో ఆందోళనకారులు క్యాపిటల్ భవనం వద్దకు చేరుకొని ట్రంప్ జెండాలు పట్టుకుని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం అకస్మాత్తుగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులతో ఘర్షణకు దిగి వారిని బలవంతంగా తోసేశారు. గోడలు ఎక్కి కిటికీ అద్దాలు పగలగొట్టి దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు. వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమై సమావేశంలో ఉన్న చట్టసభ్యులను బయటకు రావద్దంటూ హెచ్చరించారు. బయటవారు లోపలకు, లోపలివారు బయటకు రాకుండా కట్టడి చేశారు. ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో అనేక మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో అదనపు బలగాలను క్యాపిటల్ భవనం వద్దకు తరలించారు. 12 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్యాపిటల్ భవంలో రెండు బాంబులు, ఓ తుపాకి స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
Published by:Sumanth Kanukula
First published:January 08, 2021, 12:05 IST