Fact Check: కోవాగ్జిన్‌లో లేగదూడల సీరం ఉందా...కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెబుతోందంటే..

(image credit - Twitter - reuters)

అప్పుడే పుట్టిన ఆవుదూడ సీరంను వేరో కణాల (vero cells) తయారీకి, వాటి పెరుగుదలకు మాత్రమే ఉపయోగిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ‘వివిధ రకాల బోవిన్ (ఆవు, గేదె జాతి జంతువులు), ఇతర జంతువుల సీరంను వేరో కణాల పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.

  • Share this:
కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌.. అన్ని రకాల కరోనా వేరియంట్లను సమర్థంగా అడ్డుకోగలదని వివిధ దేశాలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. కానీ మన దేశంలో మాత్రం ఈ టీకాపై వ్యతిరేక ప్రచారం కొనసాగుతోంది. కోవాగ్జిన్ తయారీపై సోషల్ మీడియా షేర్ చేస్తున్న కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ టీకా తయారీలో అప్పుడే పుట్టిన లేగ దూడల సీరం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లలో వాస్తవాలను వక్రీకరించి, తప్పుడు సమాచారాన్ని వ్యాపిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఒక ప్రకటన సైతం విడుదల చేసింది.

అప్పుడే పుట్టిన ఆవుదూడ సీరంను వేరో కణాల (vero cells) తయారీకి, వాటి పెరుగుదలకు మాత్రమే ఉపయోగిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ‘వివిధ రకాల బోవిన్ (ఆవు, గేదె జాతి జంతువులు), ఇతర జంతువుల సీరంను వేరో కణాల పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో ఇదొక ప్రామాణిక పదార్థం. టీకాల ఉత్పత్తిలో ఈ వేరో కణాలను ఉపయోగిస్తారు. పోలియో, రేబిస్, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ల తయారీలో ఈ పద్ధతిని కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు’ అని ఆరోగ్య శాఖ నివేదిక స్పష్టం చేసింది.

తుది వ్యాక్సిన్‌లో సీరం ఉండదు
వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిలో జీవ‌క‌ణాల అభివృద్ధి కోసం వీరో సెల్స్‌ను వాడుతారు. ఇలా పెరిగిన వేరో కణాలను కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో శుభ్రం చేస్తారు. ఈ క్రమంలో ఆవుదూడ సీరం ఆనవాళ్లు దీని నుంచి పూర్తిగా తొలగిపోతాయి. ఆ తరువాత, ఈ వేరో కణాలకు కరోనా వైరస్‌ను ఎక్కిస్తారు. వైరల్ లోడు పెంచేందుకు ఇలా చేస్తారు. అనంతరం వైరల్ పెరుగుదల ప్రక్రియలో వేరో కణాలు పూర్తిగా నాశనం అవుతాయి. ఆ తరువాత ఈ పద్ధతిలో కృత్రిమంగా పెంచిన వైరస్‌ను క్రియారహితంగా (inactivated virus) మార్చి, శుద్ధి చేస్తారు. ఈ ఇన్‌యాక్టివేటెడ్‌ వైరస్‌ను తుది వ్యాక్సిన్ తయారీకి ఉపయోగిస్తారు.

ఫ్రతీకాత్మకచిత్రం


అంటే తుది ఉత్పత్తిగా తయారైన కోవాగ్జిన్‌ డోసుల్లో ఆవుదూడల సీరం ఉండే అవకాశమే లేదు. దీన్ని బట్టి చూస్తే, అసలు దూడ సీరంను కోవాగ్జిన్ తయారీలో తుది ముడి పదార్థంగా కూడా పరిగణించరు. అందువల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వార్తలను, వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా, అందరూ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. కోవాగ్జిన్‌ టీకాల తయారీలో ఆవు దూడ సీరంను ఉపయోగించినట్టు డీసీజీఏ ఇటీవల వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. ఈ విషయాన్ని కొందరు వక్రీకరించి, నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: