• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • EXPLAINER LOST GOLDEN CITY NEWLY DISCOVERED ONE IN EGYPT HERE THE INTERESTING FACTS GH SRD

Explainer : ఈజిప్టులో బయటపడ్డ పురాతన నగరం..వెలుగులోకి ఆసక్తికర విషయాలు..

Explainer : ఈజిప్టులో బయటపడ్డ పురాతన నగరం..వెలుగులోకి ఆసక్తికర విషయాలు..

ఈజిప్టులో బయటపడ్డ పురాతన నగరం..వెలుగులోకి ఆసక్తికర విషయాలు..

Explainer : ప్రాచీన ఈజిప్టు చరిత్రలో భాగమైన టుటాంకామున్ రాజు మార్చురీ టెంపుల్ కోసం వారు ఈ ఆపరేషన్ చేపట్టారు. బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు హోవార్డ్ కార్టర్, లార్డ్ కార్నర్వోన్ 1922లో టుటాంకామున్ రాజు సమాధిని గుర్తించారు.

  • Share this:
ఈజిప్టులో మరో అద్భుతమైన కట్టడం బయటపడింది. దాదాపు 3000 ఏళ్ల క్రితం నిర్మించిన ఒక నగరాన్ని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. దీన్ని ‘లాస్ట్ గోల్డెన్ సిటీ’ అని పిలుస్తున్నారు. క్రీస్తుశకం 1391 ను౦చి 1353 వరకు ప్రాచీన ఈజిప్టును పరిపాలి౦చిన అమెన్హోటెప్-3 కాలంలో ఈ పురాతన నగరాన్ని నిర్మించినట్టు శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఆ దేశంలోని లక్సర్ ప్రావిన్సులో ఈ చారిత్రక నగరం బయటపడింది. దీన్ని ఫారో చక్రవర్తుల గోల్డెన్ యుగంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. మట్టి ఇటుకలతో కట్టిన ఇళ్లులు, కళాఖండాలు, వస్తు సామగ్రి ఇక్కడ బయటపడ్డాయి. కొందరు ఈ నిర్మాణాలను "పురాతన ఈజిప్టు పాంపీ" (ancient Egyptian Pompeii) అని కూడా పిలుస్తున్నారు.తాజాగా కనుగొన్న నగరం నైలు నదికి పశ్చిమ తీరంలో ఉంది. కొలొస్సి ఆఫ్ మెమ్నన్, మెడినెట్ హబు, కింగ్ రామ్సెస్-2 గుడి అయిన రామెస్సియం వంటి ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్లకు దగ్గర్లోనే ఇది ఉండటం విశేషం. గత ఏడాది సెప్టెంబర్లో పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో త్రవ్వకాలు చేపట్టారు. ప్రాచీన ఈజిప్టు చరిత్రలో భాగమైన టుటాంకామున్ రాజు మార్చురీ టెంపుల్ కోసం వారు ఈ ఆపరేషన్ చేపట్టారు. బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు హోవార్డ్ కార్టర్, లార్డ్ కార్నర్వోన్ 1922లో టుటాంకామున్ రాజు సమాధిని గుర్తించారు. అప్పట్లో ఇక్కడ భారీ సంపద బయటపడింది. దీనికి సమీపంలో రాజు మార్చురీ టెంపుల్ కోసం తవ్వకాలు ప్రారంభించారు. ఈ క్రమంలో పరిశోధకుల బృందం మట్టి ఇటుకలతో నిర్మించిన ఈ కట్టడాలను గుర్తించింది. పూర్తి స్థాయి తవ్వకాల్లో ఏకంగా ఒక నగరమే బయటపడింది.

ఇక్కడి నిర్మాణాల్లో రోజువారీ అవసరాలకు ఉపయోగించే పాత్రలతో నిండిన గదులు బయటపడ్డాయి. వైన్ తయారీకి వాడే పాత్రలు, ఉంగరాలు, తాయత్తులు, రంగురంగుల కుండలు, కుమ్మరి, చేనేత పనిముట్లను పరిశోధకులు కనుగొన్నారు. కింగ్ అమెన్హోటెప్-3 పరిపాలనా కాలంలో ఈ నగరం మనుగడలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ముద్రలు ఉన్న నాణేలు ఇక్కడ బయటపడ్డాయి. ఫారోల పాలనలో స్వర్ణయుగంగా గుర్తింపు సాధించిన కింగ్ టుటాంకామున్‌కు.. కింగ్ అమెన్హోటెప్-3 తాత కావడం విశేషం. టుటాంకామున్‌, ఆ తరువాత వచ్చిన రాజుల పాలనలో కూడా ఈ నగరం ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ చారిత్రక నగరంలో ఆలయాల శిథిలాలు, వేల సంఖ్యలో విగ్రహాలు, కళాకృతులు, ఆభరణాలను రూపొందించే బట్టీలు, పదార్థాలు నిల్వ ఉంచే కుండలు, వంటగదులు, శ్మశాన వాటికలు బయటపడ్డాయి. నివాస సముదాయాలు ఒకవైపు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ నగరంలోని ఉత్తర భాగాన్నే వెలికితీశారు. దక్షిణ భాగాన్ని పూర్తిగా గుర్తించాల్సి ఉంది. ఈ నగరం ఒకప్పుడు ఫారో సామ్రాజ్యంలో అతిపెద్ద పరిపాలనా కేంద్రంగా, పారిశ్రామిక స్థావరంగా వర్ధిల్లిందని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ తెలిపారు. వేల ఏళ్ల క్రితం నాటి ఈ నగరం ఆనవాళ్లు ఇప్పటి వరకు బయట పడకపోవడం విశేషం.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు