ENGLAND EMPLOYMENT TRIBUNAL RULED THAT CALLING A MAN BALD IN THE WORKPLACE FALLS WITHIN THE PURVIEW OF SEXUAL HARASSMENT SK
Bald Head: 'బట్టతలోడు' అని పిలిస్తే.. అది లైంగిక వేధింపు కిందకే వస్తుంది.. సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
Bald Head: కంపెనీ సూపర్వైజర్లు అతడిని బట్టతలోడు అని ఎగతాళి చేశారు. మానసికంగా వేధించి.. ఆ తర్వాత అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారు. అతడికి తిక్కరేకి ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో.. సంచలన తీర్పు వెలువరించింది.
బట్టతల (Bald Head) సమస్య చాలా మంది పురుషుల్లో కనిపిస్తుంది. గతంలో 50 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు ఊడి.. బట్ట తల కనిపించేది. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం వల్ల.. ప్రస్తుతం పాతికేళ్ల యువత కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అలాంటి వారంతా నలుగురిలో కలవలేకపోతున్నారు..నవ్వుతూ మాట్లాడలేకపోతున్నారు. స్నేహితులు, తోటి ఉద్యోగులు తమ బట్టతలపై జోక్‌లు వేయడాన్ని ఇబ్బందిగా ఫీలవుతున్నారు. యూకే (United Kingdom)లోని ఓ వ్యక్తికి ఇలాంటి సమస్యే ఎదరయింది. ఆఫీసులో తనను బట్టతల వాడని ఎగతాళి చేసేవారు. అంతేకాదు వివక్షకు గురిచేసి ఉద్యోగం నుంచి తీసేశారు. అంతే.. అతడి విపరీతంగా కోపం వచ్చింది. సదరు కంపెనీపై ట్రబ్యునల్లో కేసు వేశాడు. ఈ కేసు విచారించిన ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది.
ఇంగ్లండ్ (England)లోని వెస్ట్ మార్క్షైర్లో బ్రిటిష్ బంగ్ మాన్యుఫ్యాక్చరింగ్ అనే కంపెనీ ఉంది. టోనీ ఫిన్ అనే వ్యక్తి ఈ కంపెనీలో ఎలక్ట్రీషన్‌గా పనిచేసేవాడు. ఐతే ఇతడికి బట్టతల ఉంది. దానిని చూసి కంపెనీ ఉద్యోగులు ఎగతాళి చేసేవారు. జోకులేసుకుంటూ నవ్వుకునే వారు. ముఖ్యంగా సూపర్ వైజర్లు అతడిని బాగా వేధించారు. తనపై వివక్ష చూపడమే కాకుండా.. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. దాదాపు 24 ఏళ్ల పాటు ఎలక్ట్రీషన్‌గా పనిచేసిన టోనీ ఫిన్‌ను గత ఏడాది మేలో విధుల నుంచి తొలగించారు. ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తీసివేయడంతో టోనీ ఫిన్ రోడ్డున పడ్డాడు. ఈ క్రమంలోనే కంపెనీ తీరుపై షెఫీల్డ్‌లోని ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్‌లో దావా వేశాడు. ఆ పిటిషన్‌పై ట్రిబ్యునల్ విచారించింది. తలపై జుట్టు తక్కువగా ఉందన్న కారణంగా కార్యాలయాల్లో పనిచేసే పురుషులను 'బట్టతల' పేరుతో పిలవడం... అవమానించడమా? లైంగికంగా వేధించడమా? అన్న అంశంపై షెఫీల్డ్ కు చెందిన ఎంప్లాయ్ మెంట్ ట్రైబ్యునల్ లో ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో వాదోపవాదాలు జరిగాయి.
న్యాయమూర్తి జోనాథాన్ బ్రెయిన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రైబ్యునల్ ఈ కేసుపై తాజాగా విచారణ జరిపింది. ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించిన కంపెనీ తరపు న్యాయవాది.. బట్టతల స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా ఉండవచ్చని అన్నారు. ట్రైబ్యునల్ అతడి వాదనతో ఏకీభవిస్తూనే... మహిళలతో పోలిస్తే, పురుషులనే ఎక్కువగా ఈ సమస్య వేధిస్తున్నందున, అందువల్ల దీన్ని లైంగిక వేధింపుగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. 'బట్టతల' అని పిలవడంవల్ల వ్యక్తుల గౌరవం దెబ్బతింటుందని, ఇది వారిని భయాందోళనకు గురిచేసే చర్య అని స్పష్టం చేసింది. బాధితుడిని వేధింపులకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు... సదరు కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఐతే ఎంత ఇవ్వాలన్నది త్వరలోనే నిర్ణయిస్తామని.. విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం ఆ తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశమైంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.