కోవిడ్–19 మహమ్మారి కారణంగా రోజూవారి పని విధానం, పద్ధతుల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది మార్చి నుంచి మన దేశంలో లాక్డౌన్ ప్రారంభమైంది. దీంతో అన్ని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు అప్పటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం, దేశంలో కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కావడంతో ఆఫీసులు తెరుచుకుంటాయని అందరూ భావించారు. అయినప్పటికీ, దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్నే కొనసాగిస్తున్నాయి. మరి ఉద్యోగులు ఈ విధానాన్ని ఆహ్వానిస్తున్నారా? లేదా అయిష్టంగానే కొనసాగిస్తున్నారా? ఆఫీసులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? అనే విషయంపై ఎంటర్టైన్మెంట్ టైమ్స్ అనే సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. దాదాపు 1,000 మంది వరకు పాల్గొన్న ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి!..
సర్వేలో పాల్గొన్న వారిలో 53.4% మంది ఇంటి నుండి పని చేయడం తమకు సౌకర్యవంతంగానే ఉందని.. దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు. ఇక, 46.6% మంది మాత్రం ఇంట్లో పనిచేయడం కంటే ఆఫీసుల్లో పని వాతావరణమే బాగుండేదని, అక్కడైతే తమ సందేహాలను సహాద్యోగులతో పంచుకునే వాళ్లమని చెబుతున్నారు. ఆఫీసులు తెరిస్తే వెంటనే వెళ్లి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అయితే, ఎక్కువ మంది మహిళలు వర్క్ ఫ్రం హోంకు మొగ్గుచూపగా.. పురుషులు మాత్రం ఆఫీసులో పనిచేయడమే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు, మనీషా ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె లాక్డౌన్ ప్రారంభం అయిన నాటి నుండి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తుంది. ఇది తనకు సౌకర్యవంతంగా ఉందని చెబుతోంది. ఈ విధానంతో తన పిల్లల సంరక్షణ చూసుకుంటూనే, ఉద్యోగం చేస్తున్నానని చెబుతోంది. తద్వారా, తన పర్సనల్, ప్రొఫ్రెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నానని పేర్కొంది. అయితే, గుర్గావ్‌కు చెందిన ప్రదీప్ మాత్రం ఇంట్లో పనిచేయండం సౌకర్యవంతంగా లేదని చెబుతున్నాడు. ఇంట్లో పిల్లల అల్లరితో పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాని, ఈ విధానం నాకు పూర్తిగా కష్టమనిపిస్తోందని చెబుతున్నాడు. అందువల్ల, త్వరగా ఆఫీసులు తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాడు.
ఉత్పాదకతలో ఏమైనా తేడా ఉందా?
అయితే, ప్రారంభంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హొమ్ అనగానే ఎగిరి గంతేశారు. ఎంచక్కా ఇంటి నుంచి పని చేసుకుంటే డబ్బు మిగులుతుంది, ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదని భావించారు. కానీ, అదే పనిగా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడంతో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చాలా మంది చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్‌లో ప్రశాంతమైన పని వాతావరణం లేకపోవడం కారణంగా పని ఉత్పాదకత చాలా వరకు దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. అయితే, సర్వేలో పాల్గొన్న వారిలో 71.3% మంది ఉద్యోగులు తమ ఉత్పాదకతలో ఎటువంటి తేడా లేదని, ఆఫీసులో ఉన్న విధంగానే అవుట్‌పుట్ ఇవ్వగలుగుతున్నామని, ఏవైనా సందేహాలుంటే, జూమ్, స్కైప్ వంటి వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ల ద్వారా నివృత్తి చేసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే, కాన్ఫరెన్స్ యాప్‌ల ద్వారా వర్చువల్‌గా పనిచేయడం కంటే, టీంతో నేరుగా కలిసి పనిచేస్తేనే సౌకర్యవంతంగా ఉంటుందని 27 ఏళ్ల విహా అనే న్యాయవాది తెలిపాడు.
భవిష్యత్తులో హైబ్రిడ్ మోడల్..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్సియ ప్రారంభం కావడంతో.. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ పనివిధానం వైపు మొగ్గు చూపుతున్నాయి. అటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం. ఇటు ఆఫీసులకు రాదల్చుకున్న వారు కార్యాలయాలకు వచ్చి ఉద్యోగ విధులను నిర్వర్తించే విధానంపై కసరత్తు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను రెండు లేదా మూడు రోజులు కార్యాలయంలో, మిగిలిన పనిదినాలు ఇంటి నుండే పని చేయమని కోరాయి. కొత్త హైబ్రిడ్ మోడల్ ఉద్యోగుల పని ఉత్పాదకతను పెంచుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Work From Home