హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: వీడెవడో తేడాగా ఉన్నాడే అని భావించిన ఏనుగులు.. పార్క్‌లోకి వచ్చిన ఓ వ్యక్తిని ఏం చేశాయంటే..

Viral News: వీడెవడో తేడాగా ఉన్నాడే అని భావించిన ఏనుగులు.. పార్క్‌లోకి వచ్చిన ఓ వ్యక్తిని ఏం చేశాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఖడ్గ మృగాలను వేటాడడానికి వెళ్లిన ముగ్గురు వేటగాళ్లలో ఒకరిని ఏనుగులు తొక్కి చంపాయి. వీడెవడో తేడాగా ఉన్నాడని అనుమానం వచ్చిన ఏనుగులు అతడిని వేటాడాయి. తొక్కి చంపేశాయి. ఆ మృతదేహాన్ని రేంజర్లు గుర్తించారు.

ఖడ్గమృగాలను వేటాడటానికి వెళ్లిన వ్యక్తిని ఏనుగుల గుంపు చంపేసిన ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. ఆ దేశంలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఎన్నో జాతుల వణ్యప్రాణులు నివాసం ఉంటున్నాయి. అక్కడికి వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరిని ఏనుగులు తొక్కి చంపాయి. పార్క్ రేంజర్ల నుంచి పారిపోయిన ఆ వ్యక్తి అనుకోకుండా ఏనుగుల మంద వైపు వెళ్లి చావును కొని తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు. ఆఫ్రికాలోని అతిపెద్ద వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో క్రూగర్ నేషనల్ పార్కు ఒకటి. ఇక్కడ ఖడ్గమృగాలు, సింహాలు, ఏనుగులు, చిరుతపులులు, అడవి బర్రెలు ఎక్కువగా నివసిస్తున్నాయి. గత శనివారం పార్కులోని దక్షిణ భాగంలో మృతుడి శవాన్ని రేంజర్లు గుర్తించారు.

క్రూగర్ పార్కులోని ఫబెని ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అక్రమ వేటకు వెళ్లారని అధికారులు తెలిపారు. వీరికి రేంజర్లు ఎదురుపడటంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏనుగుల మంద, వాటి పిల్లలు ఉన్న వైపు పరుగెత్తారు. వీరిలో ఒకరిని రేంజర్లు వెంబడించారు. హెలికాప్టర్లు, డాగ్ స్క్వాడ్ సాయంతో వెంటాడి పట్టుకున్నారు. అరెస్టయిన ఆ వ్యక్తి ఏనుగుల మందలోకి పరుగెత్తిన తన సహచరుల గురించి చెప్పాడు. వారిలో ఒకరు చనిపోయి ఉండవచ్చన్నాడు. ఆ తరువాత ఏనుగుల దాడిలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని రేంజర్లు కనుగొన్నారు.

మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారు వెంట తీసుకువచ్చిన బ్యాగును పోలీసులు గుర్తించారు. దాంట్లో ఒక రైఫిల్, గొడ్డలి, ఇతర సామగ్రి ఉన్నాయని తెలిపారు. ఖడ్గమృగాల అక్రమ వేటకు ప్రయత్నించినందుకు వీరిపై అభియోగాలు మోపారు. క్రూగర్ నేషనల్ పార్క్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ గారెత్ కోల్మన్ ఈ విషయానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. సిబ్బంది క్రమశిక్షణ, టీమ్ వర్క్, పట్టుదల ద్వారా అక్రమ వేటను నిరోధించవచ్చని చెప్పారు. వేటగాళ్ల ఆటలు కట్టిస్తున్న సిబ్బంది పనితీరును ప్రశంసించారు.


‘అక్రమ వేటను నిరోధించడం ప్రజలందరి బాధ్యత. ఎంతోమంది జీవనోపాధికి అక్రమ వేట ముప్పు కలిగిస్తుంది. కుటుంబాలను నాశనం చేస్తుంది. అభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ఉపయోగపడే వనరులను వేటగాళ్లు నిర్వీర్యం చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి ప్రయత్నాలను కలసికట్టుగా అడ్డుకోవాలి. తప్పించుకున్న మూడవ వ్యక్తిని పట్టుకోవటానికి, పార్క్ చుట్టూ నివసిస్తున్న ప్రజలు పోలీసులకు సహాయం చేయాలి’ అని కోల్మన్ కోరారు.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Elephant attacks, South Africa

ఉత్తమ కథలు