అలసిన శరీరానికి మసాజ్ ఎంతో అసవరం. గ్రామాల్లో అయితే నూనె గానీ, మరేదైనా ద్రావణం ఉంటే దానిని పోసి మసాజ్ చేయించుకుంటారు. ఇక పట్టణాల్లో ఈ మధ్య మసాజ్ సెంటర్లు వీధికొకటి వెలుస్తున్నాయి. ఈ మసాజ్ సెంటర్లలో సాగే గుట్టు వేరే సంగతి లెండి..!! కానీ నగర ప్రజలు చాలా మంది మసాజ్ చేయించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే అక్కడ వాళ్లు ఏవో ఆయిల్స్ పోసి మసాజ్ చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా పాముతో మసాజ్ చేసే టెక్నిక్ గురించి తెలుసుకున్నారా..? ఈ మధ్య స్పాలలో ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. పాములతో మసాజ్ ఏంటి..? అవి కరవవా..? అనుకుంటున్నారా..? అయితే మనం ఈజిప్ట్ వెళ్లి రావాల్సిందే.
పాములను చూస్తేనే చాలా మందికి గుండెల్లో దడ. దానిని టీవీలోనో, మొబైల్ లోనో చూస్తేనే మన పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటి పాములను దగ్గరగా చూస్తే.. చూడటం కాదు.. అవి మన మీద పాకితే... ఊరికే పాకడమేంటి..? ఏకంగా మసాజే చేస్తే..? ఇవన్నీ ఊహాజనితం కాదు. నిజంగా నిజం. పాములను దగ్గర్నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా.. అలాంటిది ఏకంగా అవి మన ఒంటిమీద ఉండి మాసాజ్ చేస్తాయంటే.. ఆ సీన్ ఇమాజినేషన్ కు కూడా అందడం లేదు కదా. కానీ దానిని నిజం చేసి చూపిస్తున్నారు ఈజిప్టులోని ఓ స్పా నిర్వాహకులు. కైరోలోని ఓ స్పాలో పాముల మసాజ్ (Snake massage) చాలా స్పెషల్.
సుమారు 28 పాములతో ఇక్కడ ‘స్నేక్ మసాజ్’ను ఆఫర్ చేస్తున్నారు. వాటిని మన బాడీ వెనకబాగంలో వదులుతారు. అవి మనను కుట్టవా..? అని మీకు సందేహం రావొచ్చు. కానీ వాటి విషం తీసేసి వాటిని మన బాడీ మీద పాకిస్తారట. సుమారు 30 నిమిషాల పాటు ఆ పాములు శరీరం మీద పాకుతూ మసాజ్ చేస్తాయట. ఆ సమయంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నామని అంటున్నారు మసాజ్ చేసుకున్నవాళ్లు.
ఈ స్నేక్ మసాజ్ పై దాని యజమాని సఫ్వాత్ సెడ్కీ స్పందిస్తూ.. ‘పాములతో మసాజ్ ఎందుకు చేస్తున్నారని మమ్మల్ని చాలా మంది అడిగారు. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. పాములతో మసాజ్ చేయడం వల్ల మనిషిలో కండరాల, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేగాక ఇది రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. ఈ పాములు మనుషుల శరీరం మీద పాకుతున్నప్పుడు వారిలో కలిగే బావోద్వేగాల కారణంగా.. ఎండోర్పిన్స్ అనే హ్యాపీ హర్మోన్లు విడుదలవుతాయి.. దీని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి...’ అని ఆయన తెలిపారు. ముందు తాము ఈ స్నేక్ మసాజ్ సెంటర్ ను ప్రారంభించినప్పుడు జనాలు రాలేదని.. కానీ దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి సవివరంగా వివరించిన తర్వాత చాలా మంది ముందుకొస్తున్నారని అన్నారు. పాములంటే భయం ఉన్నవాళ్లు కూడా ఈ మసాజ్ చేయించుకుంటున్నారని సఫ్వాత్ అన్నారు. మరి మీరు కూడా ఆ అనుభూతిని పొందాలనుకుంటున్నారా..? అయితే కైరోకు టికెట్ బుక్ చేసుకోండి.
Published by:Srinivas Munigala
First published:December 30, 2020, 16:55 IST