హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Dog DNA Test: శునకం మాదంటే మాదంటూ ఇద్దరి ఫైట్.. ఇక లాభం లేదని కుక్కకు డీఎన్‌ఏ టెస్ట్.. మొత్తానికి ఇలా శుభం కార్డ్..!

Dog DNA Test: శునకం మాదంటే మాదంటూ ఇద్దరి ఫైట్.. ఇక లాభం లేదని కుక్కకు డీఎన్‌ఏ టెస్ట్.. మొత్తానికి ఇలా శుభం కార్డ్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మధ్యప్రదేశ్‌లో ఓ శునకం కోసం ఇద్దరి మధ్య నాలుగు నెలల నుంచి నడుస్తున్న వివాదానికి పోలీసులు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఆ శునకం ఎవరిదో తేల్చడానికి పోలీసులు నానా పాట్లే పడ్డారు. ఇద్దరూ మా పెంపుడు కుక్కంటే మా పెంపుడు కుక్కంటూ పోలీసులకు...

నర్మదాపురం: మధ్యప్రదేశ్‌లో ఓ శునకం కోసం ఇద్దరి మధ్య నాలుగు నెలల నుంచి నడుస్తున్న వివాదానికి పోలీసులు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఆ శునకం ఎవరిదో తేల్చడానికి పోలీసులు నానా పాట్లే పడ్డారు. ఇద్దరూ మా పెంపుడు కుక్కంటే మా పెంపుడు కుక్కంటూ పోలీసులకు పిచ్చెక్కించారు. అయితే.. పోలీసులకు ఎట్టకేలకు ఆ శునకం ఎవరిదో తేల్చేందుకు ఓ ఉపాయం తట్టింది. డీఎన్‌ఏ టెస్ట్ చేస్తే అసలు నిజమేంటో తేలుతుందని భావించారు. అనుకున్నట్టుగానే డీఎన్‌ఏ టెస్ట్ చేసి ఆ కుక్క ఎవరికి చెందుతుందో పోలీసులు తేల్చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య లాబ్రడార్ జాతికి చెందిన మూడేళ్ల శునకం కోసం నాలుగు నెలలుగా వివాదం నడుస్తోంది. నవంబర్ 2020లో షాదాబ్ ఖాన్ తన కోకో(పెట్ డాగ్ నేమ్) కనిపించడం లేదని ఓ ఏబీవీపీ నేత దానిని దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏబీవీపీ నేత శివహరే ఇంటి వద్ద తన కోకోను చూశానని షాదాబ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే.. ఈ విషయం తెలిసిన శివహరే మరుసటి రోజే ఆ శునకాన్ని కొన్న పత్రాలను తీసుకొచ్చి, పోలీసులకు చూపించి ఆ కుక్క తనదేనని చెప్పాడు. దానికి ‘టైగర్’ అని పెట్ నేమ్ కూడా పెట్టినట్లు తెలిపాడు. ఇతర్సిలో తాను ఈ కుక్కను కొనుగోలు చేసినట్టు పోలీసులకు వివరించాడు. అయితే.. ఇక్కడ విచిత్రమేంటంటే.. ఆ కుక్క ఇద్దరితోనూ స్నేహంగా ఉండటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఇద్దరూ ఆ కుక్క తల్లి గురించి కూడా తమకు తెలుసని పోలీసులకు వివరించారు. ఇద్దరూ వేరువేరు తల్లి శునకాల గురించి చెప్పడంతో మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది. ఇక.. ఆ కుక్కకు డీఎన్‌ఏ టెస్ట్ చేస్తేనే వివాదానికి శుభం కార్డు పడుతుందని ఖాకీలు ఓ నిర్ణయానికొచ్చారు.

ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కలకలం.. 11 మంది విద్యార్థులకు కరోనా


డీఎన్‌ఏ టెస్ట్ పూర్తయ్యే దాకా ఆ కుక్క కార్తీక్ శివహరే దగ్గరే ఉంటుందని పోలీసులకు షాదాబ్‌కు చెప్పారు. రెండు టీంలను ఏర్పాటు చేసి.. ఆ ఇద్దరూ ఆ కుక్కను ఎక్కడ కొన్నామని చెప్పారో ఆ రెండు ప్రాంతాలకు పంపారు. ఆ రెండు తల్లి కుక్కల డీఎన్‌ఏ శాంపిల్స్‌ను సేకరించారు. మొత్తానికి.. ఆ కుక్క డీఎన్‌ఏ రిపోర్ట్ శుక్రవారం రావడంతో ఈ వివాదానికి తెర పడింది. ఆ కుక్క జర్నలిస్ట్ అయిన షాదాబ్ ఖాన్‌కే చెందుతుందని డీఎన్‌ఏ రిపోర్ట్ స్పష్టం చేసింది.

First published: