సాధారణంగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా.. పలుచోట్ల వినాయకుడి లడ్డు వేలం వేయడం చూస్తుంటాం. వినాయకుడి లడ్డు ప్రసాదాన్ని కొందరు భక్తులు భారీ మొత్తంలో చెల్లించి దక్కించుకుంటుంటారు. అయితే ఓ భక్తుడు మాత్రం దేవుడికి సమర్పించిన కొబ్బరికాయను సొంతం చేసుకోవడానికి భారీ మొత్తం చెల్లించాడు. వేలంలో పాల్గొన్న అతడు కొబ్బరి కాయను కొనేందుకు రూ. 6.5 లక్షలు వెచ్చించాడు. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని బాగల్‌కోట్( జిల్లాలోని (Bagalkot district) జమఖండి చిక్కలకి గ్రామంలోని 12వ శతాబ్దానికి చెందిన మలింగరాయ దేవాలయంలోని దైవికమైన కొబ్బరికాయను సొంతం చేసుకోవడాని విజయపుర జిల్లాలోని(Vijayapura district) టిక్కొటా గ్రామానికి చెందిన మహావీర్ హరకే ఈ మొత్తం చెల్లించాడు.
మలింగరాయ దేవాలయ కమిటీ(Malingaraya temple committee) బుధవారం ఏర్పాటు చేసిన ఈ వేలంలో చాలా మంది గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ‘మలింగరాయ దేవుడు శివుని యొక్క నంది రూపంగా పరిగణించబడతారు. దేవుని యొక్క సింహాసనంలో ఉంచిన కొబ్బరికాయను(coconut) దైవంగా, అదృష్టంగా భక్తులు భావిస్తారు’అని ఆలయ కమిటీ కార్యదర్శి బసు కడ్లీ తెలిపారు.
ఇందుకు సంబంధించి మహావీర్ హరకే మాట్లాడుతూ.. ‘కొంతమంది దీనిని పిచ్చి అంటారు. కొబ్బరికాయకు ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం మూడనమ్మకం అని కూడా అంటారు. కానీ ఇది నా భక్తి, నమ్మకం’అని తెలిపారు. ‘నేను తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్నప్పుడూ.. నేను మలింగరాయ దేవుడిని పూజించాను. ఆ తర్వాత కొద్ది నెలలకే నా సమస్యలు అన్ని పరిష్కారం అయ్యాయి. అందుకే ఆ పవిత్రమైన కొబ్బరికాయను నా ఇంట్లో ఉంచి ప్రతి రోజు పూజలు చేస్తాను. అది అదృష్టాన్ని తెస్తుంది’అని మహావీర్ చెప్పారు.
దేవుని సింహాసనం వద్ద కొబ్బరికాయను చాలా కాలంగా వేలం వేస్తున్నట్టుగా ఆలయ కమిటీ కార్యదర్శి బసు కడ్లీ(Basu Kadli) చెప్పారు. అయితే ఎప్పుడు కూడా వేలం పాట రూ. 10 వేలు దాటలేదని అన్నారు. కానీ ఈసారి రూ. 1,000తో మొదలైన వేలం పాట నిమిషాల్లోనే లక్ష దాటిందని చెప్పారు. ‘వేలంలో మరో భక్తుడు రూ. 3 లక్షలు అని చెప్పాడు. మేము అంతటితో వేలం ప్రక్రియ ముగిసిందని అనుకున్నాం. ఆ తర్వాత మహావీర్ రూ. 6.5 లక్షలకు వేలం పాట పాడాడు. కొబ్బరికాయను సొంతం చేసుకున్నాడు. ఆలయ కమిటీ వేలం ద్వారా వచ్చిన డబ్బులను అభివృద్ది కోసం, ఇతర మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది’అని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, VIRAL NEWS