Cyberabad Police: నేను మరీ అంత వెధవలా కనిపిస్తున్నానా..? వైరలవుతున్న సైబరాబాదు పోలీసుల ట్వీట్..

Image credits Twitter

Cyberabad Police: "నేను మరీ అంత వెధవలా కనిపిస్తున్నానా.. ఓ మాదిరిగా కూడా కనిపించటం లేదా..’’ బ్రహ్మానందం డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడిదే డైలాగ్ ను హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎందుకో తెలుసా..?

  • News18
  • Last Updated :
  • Share this:
"అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు, మరి ఎవరో గిఫ్ట్ ఇస్తాడు అంటే ఎలా నమ్ముతారు?” అంటూ సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ తెగ ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం డైలాగును మీమ్ గా పెట్టిన తీరు మరింత ఆలోచింప చేసేలా ఉంది. వాలెంటైన్స్ డే గిఫ్టు, లక్కీ డ్రా వంటి ఏవేవో ఆఫర్లతో మెసేజీలు, కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలంటూ సైబరాబాద్ పోలీసులు ప్రజలను ఎప్పటి నుంచో చైతన్యపరుస్తున్నారు. అయిప్పటికీ భాగ్యనగరంలో ఇలా నిత్యం మోసపోతున్న ఎంతోమంది అభాగ్యులు పోలీసుల చుట్టూ తిరుగుతూ తాము మోసపోయినట్టు కంప్లైంట్లు ఇస్తూనే ఉంటారు. ఇలాంటి వారికి అనామక కాల్స్ లో అనామకులు ఆశచూపితే లొంగద్దని సైబరాబాద్ పోలీస్ అధికార ట్విట్టర్ అకౌంట్లో తరచూ చక్కని మెసేజీలు పోస్ట్ చేస్తుంటారు.

తాజాగా నగరంలో ఇలా మోసపోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుండగా క్రిస్ట్ మస్, న్యూఇయర్, సంక్రాంతి, వాలెంటైన్స్ డే సందర్భంగా ఇలాంటి మోసాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. ఈనేపథ్యంలో సైబరాబాద్ సీపీ వీసి సజ్జనార్ ఇలాంటి అవగాహనా కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు రోడ్ల కూడళ్లలో సైతం ఇలాంటి ప్రకటనలను తెలుగు, హిందీ, ఇంగ్లీషుల్లో నిత్యం వినిపించేలా చేస్తూ సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.

ట్విట్టర్ అప్డేట్స్..

ఇప్పటికే 24 వేలకు పైగా ట్వీట్లు చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్విట్టర్లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ నగర ప్రజలకు చేరువగా ఉంటోంది. నెటిజన్ల కంప్లైంట్లు, వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఇలాంటి బారిన పడద్దను మోడస్ ఆపరండీలను సైతం వీరు వివరిస్తున్నారు. నకిలీ పేమెంట్స్ గేట్వే లైన నకిలీ పేటీఎం యాప్ లతో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజల్లోకి విస్తృతంగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. వరుసగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాల గుట్టును రట్టు చేసేలా సైబరాబాద్ పోలీసులు చొరవ తీసుకుంటున్నారు.

రమణా.. ఖాతా ఖాళీ అయిపోతాది ..

డీమార్ట్, టాటా కంపెనీ, మహీంద్రా హాలిడే, యూరో లాటరీ వంటి పాపులర్ పేర్లతో నకిలీ లింక్ లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. "రమణా.. ఖాతా ఖాళీ అయిపోతది అంటూ" వీరు పోస్ట్ చేసిన తీరు నెటిజన్లను ఆలోచింపచేస్తోంది. సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో అమాయకుల ఖాతాలను దోచేస్తున్నారని స్పిన్ వీల్ వంటి లింకులను క్లిక్ చేయద్దని, బ్యాంకు ఖాతాల వివరాలు, కేవైసీ అప్ డేషన్, ఏటీఎం కార్డు అప్ డేట్ పేరుతో వచ్చే కాల్స్ కు స్పందించవద్దని పెద్దఎత్తున ప్రచారకార్యక్రమాలను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో చేపడుతున్నారు. ఇక ఆపదలో అమ్మాయిలు, మహిళలకు బోలెడన్ని టిప్స్ ఇస్తూ.. తమవద్ద ఉన్న వస్తువులతో తమను తాము ఎలా కాపాడుకోవాలో టిప్స్ కూడా ట్విట్టర్లో చెబుతున్నారు ఖాకీలు.
Published by:Srinivas Munigala
First published: