Cow Cuddling: ఆవుకు ఆలింగనం.. విదేశాల్లో ఇప్పుడిదే ట్రెండ్.. ఎందుకో తెలుసా?

ఆవును హత్తుకున్న మహిళ

ప్రశాంతంగా గోశాలకు వచ్చి, గోవుల్ని హత్తుకొని... మనసు కుదుటపరుచుకుని వెళ్లండి అని గోశాలల యజమానులు చెబుతున్నారు. గోవుల్ని హత్తుకోవడం వల్ల ఒంటరితనం, దిగులు లాంటివి తగ్గుతున్నాయని అక్కడి ప్రజలు కొంతమంది చెబుతున్నారు.

  • Share this:
కరోనా కాలంలో ఒకరికొకరు దగ్గరగా నిలబడటానికే ప్రజలు భయపడుతున్నారు. సోషల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి కావడంతో దగ్గరివాళ్లను కూడా దూరంగా పెడుతున్నాం. దీంతో హత్తుకోవడంలో ఉన్న ఆప్యాయత, అనుభూతి మిస్‌ అవుతున్నాం. దీనివల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మానసిక ఒత్తిడి కలిగినప్పుడు హగ్ చేసుకోవడం వల్ల మనసు కుదుట పడుతుందని చెబుతున్నారు వైద్యులు. దీని కోసం ఉత్తమమైన ఛాయిస్‌ గోవులు అని వారు పేర్కొంటున్నారు. నెదర్లాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో గోవులను హత్తుకోవడమేనే కాన్సెప్ట్‌కు ఇప్పుడు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. అయితే ఇదేదో కొత్త విషయం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ దశాబ్దం నుంచి ఇలాంటి కార్యక్రమం జరుగుతూనే ఉంది. డచ్‌ ప్రావిన్స్‌లో చాలా కాలం క్రితమే ఈ విధానాన్ని ప్రారంభించారు. మనుషులు, జంతువుల మధ్య అనుబంధాన్ని పెంచడానికి, ప్రకృతితో మమేకం కావడానికి ఇది ఉపయోగపడుతుందని అలా చేసేవారు. ఇప్పుడు ఇలా గోవులను హత్తుకునేవారి సంఖ్య బాగా పెరిగింది.

గోవుల్ని మనుషులు హత్తుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గోవును హత్తుకోవడం వల్ల ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్ విడుదలవుతుందట. అది ఓ థెరపీలా పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు గోవుల్ని హత్తుకునేటప్పుడు.. అవి తిరిగి మనుషుల్ని హత్తుకుంటున్నాయని వైరల్‌ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మనుషులు హత్తుకుంటుంటే గోవులు కూడా ఎంతో ఆనందపడుతున్నాయని అర్థమవుతోంది.

నెదర్లాండ్‌లో చాలా గోశాలల యజమానులు.. ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. ప్రశాంతంగా గోశాలకు వచ్చి, గోవుల్ని హత్తుకొని... మనసు కుదుటపరుచుకుని వెళ్లండి అని గోశాలల యజమానులు చెబుతున్నారు. గోవుల్ని హత్తుకోవడం వల్ల ఒంటరితనం, దిగులు లాంటివి తగ్గుతున్నాయని అక్కడి ప్రజలు కొంతమంది చెబుతున్నారు. ఇదంతా గోవుల్ని హత్తుకున్నప్పుడు మనుషుల్లో ఉత్పత్తి అయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోన్ వల్లనే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే గోవుల్ని హత్తుకోవడం వల్ల మనసుకు ప్రశాంతతతో పాటు, రక్తపోటు, వెన్నునొప్పి, గుండె జబ్బులు, ఒత్తిడి, కుంగుబాటు లాంటివి చాలా వరకు తగ్గుతాయని గుర్‌గ్రామ్‌లోని ఓ ఎన్‌జీవో చెబుతోంది. కామధేను గోధామ్‌ అండ్‌ ఆరోగ్య సంస్థాన్‌ అనే ఓ ఎన్‌జీవో చాలా రోజులుగా గురుగ్రామ్‌లో గోశాలను నిర్వహిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published: