COVID VACCINE MAGIC PARALISED MAN STARTED MOVEMENT AND GOT SPEECH BACK AFTER GETTING COVISHIELD VACCINATION IN JARKHAND SK
OMG: అద్భుతం చేసిన కరోనా టీకా.. మూగ వ్యక్తికి మాటలు.. చచ్చుబడిన శరీరంలో కదలికలు
ప్రతీకాత్మక చిత్రం
Corona Vaccine: కరోనా టీకా అద్భుతం చేసింది. డాక్టర్లకు కూడా అర్ధం కాని విధంగా మ్యాజిక్ చేసింది. సంజీవనిలా పనిచేసి దులార్‌చంద్ ముండాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు 150 కోట్ల డోసులకు పైగా కోవిడ్ టీకాలు వేశారు. ఐతే ఇప్పటికీ కొందరిలో టీకాలపై సందేహాలు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయపడి టీకాలు వేసుకోవడం లేదు. కానీ ఝార్ఖండ్‌లో మాత్రం కరోనా టీకా అద్భుతం చేసింది. పక్షవాతంలో మంచానికే పరిమితమైన ఓ వ్యక్తిలో కదలికలు తెప్పించింది. అంతేకాదు మూగబోయిన ఆ గొంతు నుంచి మళ్లీ మాటలు వస్తున్నాయి. కరోనా టీకా వేసుకున్న తర్వాత అతడు మాట్లాడడం మొదలు పెట్టాడు. శరీర అవయవాల్లోనూ కదలికలు వచ్చాయి. వ్యాక్సిన్ ఏదో మాయ చేసిందని స్థానికులు ఆశ్చర్యపోయారు. డాక్టర్లు సైతం ఖంగుతిన్నారు.
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. బొకారో జిల్లాలోని పెతర్వార్ మండలం సల్గాడి గ్రామానికి చెందిన 55 ఏళ్ల దులార్‌చంద్ ముండా ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. డాక్టర్లు తల, వెన్నెముకకు సర్జరీ చేసి.. అతడి ప్రాణాలను కాపాడారు. కొన్ని నెలల చికిత్స అనంతరం దులార్‌చంద్ కోలుకున్నాడు. కానీ అతని శరీరంలోని పలు అవయవాలు మాత్రం పనిచేయడం లేదు. మాట పడిపోయింది. పక్షవాతం వల్ల కాళ్లు చేతులు పనిచేయడం లేదు. ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ఎటూ కదల్లేక.. ఐదేళ్లుగా నరకం చూస్తున్నాడు. ఐతే ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందున అందరిలానే కుటుంబ సభ్యులు అతడికి కూడా కరోనా టీకా వేయించారు. అంగన్వాడీ కార్యకర్తలు అతడి ఇంటికే వచ్చి కోవిషీల్ట్ వ్యాక్సిన్ వేయించారు. అంతే.. ఆ కరోనా టీకా అద్భుతం చేసింది. డాక్టర్లకు కూడా అర్ధం కాని విధంగా మ్యాజిక్ చేసింది. సంజీవనిలా పనిచేసి దులార్‌చంద్ ముండాకు కొత్త జీవితం ప్రసాదించింది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజు నుంచి.. దులార్ చంద్ మాట్లాడడం మొదలు పెట్టాడు. అతడి శరీర భాగాల్లో కదలికలు కనిపించాయి. ఐదేళ్లుగా మూగబోయిన గొంతు మళ్లీ మాట్లాడడం.. చచ్చుబడిన అవయవాల్లో కదలికలు రావడంతో.. కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. కరోనా టీకా నిజంగా అద్భుతం చేసిందని దులార్‌చంద్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమిత్రా దేవి పేర్కొన్నారు. జనవరి 4న దులార్‌చంద్‌కు అంగన్వాడీ కేంద్ర సిబ్బంది తన ఇంటి వద్దే వ్యాక్సిన్ వేశారని.. ఆ మరుసటి రోజు నుంచి అతడి శరీరంలో మార్పులను గమనించామని చెప్పారు. చచ్చుబడిపోయిన అవయవాల్లో కదలికలు మొదలయ్యాయని.. అంతేకాదు అందరిలానే మాట్లాడుతున్నాడని వివరించారు.
దులార్‌చంద్ వెన్నెముకకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడని.. ఎటూ కదల్లేని స్థితిలో ఐదేళ్లుగా మంచానికే పరిమతమయ్యాడని డాక్టర్లు తెలిపారు. కానీ కరోనా టీకా వేసుకున్న తర్వాత అతడి శరీరంలో కదలికలు వచ్చాయని.. దీనిపై అధ్యయనం జరగాల్సి ఉందని వెల్లడించారు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విసయమని సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ పేర్కొన్నారు. మొత్తంగా ఆ కరోనా వ్యాక్సిన్ దులార్‌చంద్‌కు కొత్త జీవితం ప్రసాదించి.. వారి కుటుంబంలో వెలుగులు నింపిందని గ్రామస్తులు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.