కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భారత్ కీలక మైలురాయిని చేరింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న క్రమంలో వైరస్ నుంచి అందరికీ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో పిల్లలకు సైతం కొవిడ్ టీకాలను అందుబాటులోకి తెచ్చింది భారత సర్కారు. దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు సోమవారం నుంచి వ్యాక్సినేషన్ షురూ అయింది. ఇవాళ ఉదయం నుంచి ఆయా కేంద్రాల్లో పిల్లలకు టీకాల పంపిణీ మొదలవుతుంది. కాగా, రిజిస్ట్రేషన్ కు ఆశించిన స్పందన వస్తుందా? అనే అనుమానాలను పటాపంచెలు చేస్తూ పిల్లలు పెద్ద సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం.
కొవిన్ పోర్టల్ ద్వారా ముందుగా పేర్లు నమోదు చేసుకున్న పిల్లలకే వ్యాక్సిన్లు అందజేయనుండగా, ఆదివారం రాత్రి నాటికే రిజిస్ట్రేషన్ల సంఖ్య 6 లక్షలు దాటడం గమనార్హం. ఆదివారం సాయంత్రం వరకు 6లక్షల 35వేల మంది యుక్త వయసు పిల్లలు వ్యాక్సిన్ పొందేందుకు కొవిన్ పోర్టల్ లో పేర్లు నమోదు చేయించుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సగటున రోజుకు మూడు లక్షల మంది పేర్లను నమోదు చేయించుకున్నట్లయింది.
జనవరి 3(సోమవారం) నుంచి ప్రారంభమయ్యే పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఏర్పాట్లపై రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, చీఫ్ సెక్రటరీలతో మాండవీయ సమీక్ష నిర్వహించారు. పేర్లు నమోదు చేసుకున్న పిల్లలు అందరికీ టీకాలు అందించాలని, వ్యాక్సిన్ మిక్సింగ్ పొరపాట్లకు తావు ఇవ్వరాదని మంత్రి అన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన చిన్నారుల కొవాగ్జిన్ టీకానే సోమవారం నుంచి పిల్లలకు అందించనున్నారు. ఈ మేరకు డీసీజీఐ ఇదివరకే అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. టీకాలు పొందాలనుకునే 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు కొవిన్ పోర్టల్ లో తల్లిదండ్రుల ఫోన్ నంబర్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా సొంత నంబర్ తోనూ చేసుకోవచ్చు. అదీ కాకపోతే, నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకే వెళ్లి వాక్ ఇన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.