కరోనా విలయానికి దేశం అల్లాడిపోతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ బాటలోనే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో కూడా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. వారం రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ రోగులతో నిండిపోయాయి. సకాలంలో ఆక్సిజన్ అందక రోగులు నరకయాతన పడుతున్నారు, ఈ నేపథ్యంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు ఆక్సిజన్ సిలిండర్లను పట్టుకొని ప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒక వైపు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. రావి చెట్టు కింద కూర్చుంటే చాలు, కరోనా రోగులకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్న పుకార్లు ఉత్తరప్రదేశ్ అంతటా వ్యాపించాయి. దీంతో ఆక్సిజన్ అందక సతమతమవుతున్న కరోనా రోగులు రావి చెట్టు కిందే పడుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా షాజహన్‌పూర్‌లోని బహదూర్‌గంజ్ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. రావి చెట్టు కింద ఉంటే ఆక్సిజన్ లభిస్తుందన్న పుకార్లు విని వారు అక్కడే నివసిస్తున్నారు. ఇలా రావి చెట్టు కింద నివసిస్తున్న ఊర్మిళ అనే మహిళ మాట్లాడుతూ.. “కరోనాతో నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఆక్సిజన్ లేదని తెలిసింది. దీంతో రావి చెట్టు ఆక్సిజన్ ఇస్తుందని నమ్మి ఇక్కడే ఉంటున్నాం. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఈ చెట్టు కింద నిజంగానే బాగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను” అని పేర్కొంది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రోషన్‌లాల్ వర్మ వెంటనే అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. రోగులను పట్టించుకోకుండా ఇలా వదిలేయడంపై అధికారులను నిలదీశారు. జిల్లా వైద్యాధికారులను పిలిపించి రోగులను వెంటనే ఆసుపత్రులకు తరలించాల్సిందిగా ఆదేశించారు. అయితే అధికారులు అక్కడి రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, రోగులు అడ్డుకున్నారు. తమకు అక్కడే సౌకర్యంగా ఉందని, ఆసుపత్రికి వెళ్లడం ఇష్టం లేదని తెగేసి చెప్పారు. దీంతో కంగుతిన్న అధికారులు ఎట్టకేలకు వారిని ఒప్పించి ఆసుపత్రికి తరలించారు.
యూపీలో బలంగా వ్యాపించిన పుకార్లు..
రావి చెట్టు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను ఇస్తుందని నమ్ముతున్నట్టు రోగుల బంధువులు ఒకరు చెప్పారు. ఆక్సిజన్ కేసమే కరోనా సోకిన వారిని రావిచెట్టు వద్దకు తీసుకువస్తున్నట్టు తెలిపారు. ‘వారు చాలావరకు కోలుకుంటున్నారు. ఇతరులు చెప్పేది మేము పట్టించుకోం. రావి చెట్టు ఆక్సిజన్ ఇస్తుందనే విషయాన్ని సంపూర్ణంగా మేం నమ్ముతున్నాం’ అని ఒకరు చెప్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో ఆక్సిజన్ కొరతపై పేషంట్లు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా.. ‘రావి చెట్టు కింద కూర్చోండి, ఆక్సిజన్ దానంతట అదే వస్తుంది’ అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19