Bike safety tips: వాన నీటిలో బండి న‌డుపుతున్నారా?.. అయితే ఇది మీకోసమే..

ప్రతీకాత్మక చిత్రం

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏదో ఒక సమయంలో వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి.

  • Share this:
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏదో ఒక సమయంలో వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. అందువల్ల ఈ సీజన్‌లో అడుగు బ‌య‌ట పెట్టాలంటే చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ముఖ్యంగా వాన‌నీటితో నిండిన రోడ్లు, వీధుల‌లో బైక్‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు ఎంతో జాగ్ర‌త్త అవ‌స‌రం. టూ వీల‌ర్స్‌పై వెళ్ళేవారు ఏమరపాటుగా ఉంటే.. ఏదో ఒక ప్ర‌మాదం జరిగే అవ‌కాశం ఉంటుంది. సాధారణంగా ఈ సీజన్‌లో రోడ్లు.. బుర‌ద‌, నీటితో నిండి ప్ర‌యాణానికి అనువుగా ఉండ‌వు. ఇలాంటి మార్గాల‌లో ప్రయాణించే వాహనదారులు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో చూద్దాం.

* ఈ విషయాలపై దృష్టి పెట్టాలి..
ముందు మీ బైక్ టైర్లు, బ్రేకులు మంచి కండిష‌న్‌లో ఉన్నాయో లేవో నిర్ధారించుకోండి. బండిలో ఇంజిన్ ఆయిల్ త‌గినంత ఉందో లేదో చూసుకోవాలి. దీంతోపాటు వాహ‌నం లైట్లు, ఇండికేట‌ర్లు, స్విచ్ గేర్లు స‌రిగా ప‌నిచేస్తున్నాయో లేవో చెక్ చేసుకోండి. ముఖ్యంగా మీ వాహ‌నానికి సంబంధించిన వైర్లు సీల్డ్‌గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. వర్షానికి తడిస్తే.. ఇవి సరిగ్గా పనిచేయవు. క‌న్సీల్డ్ కానీ వైర్లు షార్ట్ స‌ర్క్యూట్‌కు దారి తీయ‌వ‌చ్చు. ఇది బైకుతోపాటూ వాహనదారులకు కూడా ప్ర‌మాద‌మే.

మీ బైక్ చైన్ పనితీరు మెరుగ్గా ఉండేలా జాగ్రత్తపడాలి. చైన్ సరిగా తిరిగేందుకు అవ‌స‌ర‌మైన ఆయిల్‌తో ఉందో లేదో చూసుకోండి. దీంతో పాటు బైక్ న‌డిపేట‌ప్ప‌డు హెల్మెట్, ఇత‌ర ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు ధ‌రించండి. పొర‌పాటున బండి ఎక్క‌డైనా వాన నీటికి స్కిడ్ అయినా.. మీకు ఎటువంటి దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా ఇవి కాపాడ‌తాయి. బయట నుంచి ఇంటికి తిరిగొచ్చాక బైక్ చైన్‌కు కాసింత ఆయిల్ అప్లై చేయండి.

* నీటి లోతుతో జాగ్ర‌త్త‌!
వర్షా కాలంలో మీరు వెళ్ళే రోడ్డు బండి మీద వెళ్ళ‌డానికి అనువుగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. నీటితో నిండిన రోడ్ల‌పై వెళ్ళాల‌నుకునే బైక‌ర్స్ ముందుగా ఆ రోడ్డుపై ఉన్న నీటి లోతును అంచ‌నా వేయ‌గ‌ల‌గాలి. నీళ్ళ‌ లోతు బైక్ బాష్ గార్డ్‌ క‌న్నా త‌క్కువ ఉంటేనే ఆ మార్గంలో ప్ర‌యాణించాలి. ఒక వేళ నీటిలోతు అంచ‌నా వేయ‌లేక‌పోతే.. దూర‌మైనా స‌రే మ‌రో దారి వెతుక్కోవ‌డం ఉత్త‌మం. అలాగే మ‌న ముందు వేకిల్‌కు త‌గినంత గ్యాప్ మెయింటైన్ చేయ‌డం అవ‌స‌రం.

ఇక ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఒక్కోసారి మోటారుసైకిల్ మొరాయించ‌వ‌చ్చు. అలాంటి సంద‌ర్భాల‌లో ఆందోళ‌న చెంద‌కూడ‌దు. బండిని ఓ ప‌క్క‌న పార్క్ చేసి.. ద‌గ్గ‌ర్లో మెకానిక్‌లు ఉంటే పిలుచుకురావాలి. లేదంటే షోరూమ్ స‌ర్వీస్ సెంట‌ర్ వారికి కాల్‌చేసి బండి ఫ‌లానా చోట ఉంద‌ని చెప్పాలి. నీళ్ళ‌లో బండి నిలిచిపోతే దాన్ని అదేప‌నిగా స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌కూడ‌దు. ఒక్కోసారి ఇంజిన్‌లోకి నీరు చేర‌తాయి. లేదంటే బండిలోని సున్నిత‌మైన ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు దెబ్బ‌తింటాయి. ఇటువంటి సంద‌ర్భాల‌లో బండిని అదేప‌నిగా స్టార్ట్ చేయ‌కుండా మెకానిక్ కు చూప‌డం ఉత్తమం.
Published by:Sumanth Kanukula
First published: