పెండింగ్ కోర్టు కేసుల కారణంగా భారత న్యాయవ్యవస్థ అసమర్థంగా మారిందనే విశ్లేషణ అర్థరహితమైనదని జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. అన్యాయం జరిగితే కోర్టులు తమపక్షాన నిలుస్తాయనే విషయం ప్రజలకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. పెండింగ్ కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. విలాసవవంతమైన వ్యాజ్యాలు, దిగువకోర్టుల్లో ప్రాథమిక సౌకర్యాల కొరత, సుప్రీం కోర్టు నుంచి దిగువకోర్టుల దాకా న్యాయమూర్తులు తగిన సంఖ్యలో లేకపోవడం వంటివి.. పెండింగ్ కేసులు పెరగడానికి కారణాలని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. ఇక ఈరోజు కేసు దాఖలు చేస్తే తెల్లారేసరికల్లా అది పెండింగ్ జాబితాలో చేరిపోతోందని, కనుక పెండింగ్ కేసులను చూసే దృక్పథం మారాలని ఆయన కోరారు.
ఇండియా, సింగపూర్ మీడియేషన్ సమ్మిట్ లో భారత ప్రధాన న్యామూర్తి ఎన్.వి.రమణ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారతీయ న్యాయస్థానాల్లో 4.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే గణాంకాలు తరచూ వింటుంటాం. ఇలా కేసుల పూర్వపరాలు తెలుసుకోకుండా అన్నింటినీ గంపగుత్తగా పెండింగ్ అనడం సబబు కాదు. కేసులు పెండింగ్‌లో ఉండటానికి విలాసవంతమైన వ్యాజ్యాలు కూడా ఒక కారణం. అన్నిరకాల వనరులు పుష్కంగా ఉన్న వ్యక్తులు కేసులు పరిష్కారం కాకుండా వివిధ రకాల ప్రొసీడింగ్స్ దాఖలు చేస్తూ న్యాయవ్యవస్థనే నిస్పృహకు గురిచేస్తున్నారు. దీనికి ఇటీవల కరోనా పరిణామాలూ తోడయ్యాయి. కేసుల పరిష్కరానికి మధ్యవర్తిత్వం మేలు’ అని జస్టిస్ రమణ విశ్లేషించారు.
పెండింగ్ కేసుల పరిష్కరానికి 360 సంవత్సరాలు
గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్ కేసులు 4.4 కోట్లు ఉన్నట్టుగా నివేదికలు చెపుతున్నాయి. కోవిడ్ లాక్‌డౌన్, నిబంధనల కారణంగా ఈకేసుల సంఖ్య 19శాతం పెరిగాయి. ప్రస్తుతం జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులలో 3.9 కోట్ల కేసులు , వివిధ హైకోర్టులలో 58.5 లక్షల కేసులు, సుప్రీం కోర్టులో 69వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్, సుప్రీం కోర్టు నివేదికలు చెపుతున్నాయి. పెండింగ్ కేసుల విషయమై జస్టిస్ మార్కండేయ కట్జూ ఓ ప్రతికకు రాసిన వ్యాసంలో ... తాజాగా ఎటువంటి కేసులు దాఖలు కాకుంటే. దేశంలో ఇప్పుడు కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి 360 సంవత్సరాలు పడుతుందని రాశారు. 2019లో మార్కండేయ కట్జూ వ్యాసం రాసే సమయానికి దేశంలో 3.3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
జడ్జీల పోస్టులు ఖాళీ
దేశవ్యాప్తంగా 25 హైకోర్టులలో 400 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి..దిగువ కోర్టులలో 5వేల న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టులోనే నాలుగు జడ్జీల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటితోపాటు దిగువ కోర్టుల్లో సౌకర్యాల కొరత కేసుల ఆలస్యానికి ప్రధాన కారణమవుతోంది. కక్షిదారులకు కోర్టుల్లో కనీస సౌకర్యాలు ఉండటం లేదని 2018లో అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా తెలిపారు. చీటికిమాటికి వాయిదాలు కోరే సంస్కృతి కూడా కేసుల పెండింగ్‌కు ఒక కారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2018లో తెలిపారు. ఇలా వాయిదాల పర్వంపై న్యాయవ్యవస్థ దృష్టిసారించింది. వీటిని నియంత్రించేందుకు న్యాయవ్యవస్థ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది.
పెండింగ్ కేసుల పరిష్కారం ఎలా?
న్యాయం జరగడం ఆలస్యమవడం అంటే న్యాయాన్ని తిరస్కరించడమనేది సహజంగా అందరూ అనేమాటే. పెండింగ్ కేసుల విషయంలో ఈ నానుడి చాలా కామన్‌గా వాడుతుంటారు. పెండింగ్ కేసుల పరిష్కరానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోందని కేంద్ర న్యాయ మంత్రతిత్వ శాఖ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. కేసులను వేగంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఇందులో భాగంగా జిల్లాస్థాయి, దానికి దిగువన్న ఉన్న కోర్టులలో మౌలిక సదుపాయాలపై వ్యక్తమవుతున్న ఆందోళనకు తగినట్టుగా ఆయా కోర్టులలో సుమారు 3వేల 800 కోర్టు హాళ్ళు ఏర్పాటు చేసినట్టు చెప్పింది.
అలాగే డిజిటల్ పరిష్కారాలను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా పెండింగ్ కేసులను తగ్గించనున్నారు. ఇందుకు దేశ వ్యాప్తంగా ఈ- కోర్టులను ఏర్పాటు చేశారు. కంప్యూటరీకరణ చెందిన న్యాయస్థానాల సంఖ్య కూడా 2014 నుంచి 2020 మధ్య.. 13,672 నుంచి 16,845కు పెరిగిందని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ఐదేళ్ల పైబడి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కరానికి ఎరియర్స్ కమిటీలను కూడా నియమించినట్టు తెలిపింది.
మధ్యవర్తిత్వమే మేలు
పెండింగ్ కేసుల పరిష్కరానికి బలమైన ప్రత్యామ్నాయ వేదిక ఉండాలనే న్యాయకోవిదుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. అమెరికాలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కర యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం ద్వారా అక్కడి ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది. ప్రతి కోర్టుకు మధ్యవర్తిత్వ కేంద్రాలను అనుబంధంగా చేయడం వల‌్ల చిన్న చిన్న నేరాలకు సంబంధించిన వివాదాలు అక్కడ పరిష్కారమవుతాయని దీనిపై రిటైర్డ్ జస్టిస్ మార్కండేయ కట్జూ తెలిపారు. నిర్ణీత సమయంలోగా వివాదాల పరిష్కరానికి మధ్యవర్తిత్వం, సయోధ్య చట్టం- 1996కు 2015లో సవరణలు చేసినట్టు కేంద్ర న్యాయశాఖ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.