గత ఏడాది లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఇరుదేశ సైన్యం కొట్లాటకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా గల్వాన్ ఘర్షణకు సంబంధించినదిగా చెప్పుకుంటున్న మరో వీడియో బయటకు వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందో మరిన్ని ఆధారాలు చూపించేలా అందులో దృశ్యాలు ఉన్నాయి. భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు చైనా సైనికులు నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. అప్పటి ఉద్రిక్త పరిస్థితుల వీడియోను నిపుణుల ఇంటర్వ్యూలో చైనా వైపు మృతిచెందిన సైనికుల కుటుంబ సభ్యులు ప్రదర్శించారు. 48 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ప్రముఖ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ట్విటర్ హ్యాండిల్ డెట్రస్ఫాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
Excerpts from a video interview of a PLA martyrs family shows footage of the #Galwanvalley clash between #India & #China, the stone pelting, close combat fighting, conditions of soldiers in the river & Chinese equipment on site well documented in these 45 seconds pic.twitter.com/4pk60K28jp
— d-atis☠️ (@detresfa_) August 2, 2021
ఈ వీడియోను అటు చైనా గానీ.. ఇటు భారత్ గానీ ధృవీకరించలేదు. గల్వాన్ ఘర్షణల్లో చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగిందని.. అనేక మంది పీఎల్ఏ సైనికులు నదిలో కొట్టుకుపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను బలపరిచేలా వీడియోలోలో దృశ్యాలు ఉన్నాయి. నదిలో కొట్టుకుపోతున్న వారిని తోటి సైనికులు కాపాడే ప్రయత్నం చేశారు. చిమ్మ చీకట్లో ఇరుదేశ సైన్యాల మధ్య భీకర పోరు జరిగినట్లుగా కనిపిస్తోంది. చైనా సైనికులను నిలువరించడంతో మన సైనికులు దూకుడు ప్రదర్శించారు. ఎక్కడా తగ్గకుండా వీరోచితంగా పోరాడినట్లు అర్ధమవుతోంది. ఐతే ఈ వీడియో ఎలా? ఎప్పుడు బయటకు వచ్చిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.
భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో గతేడాది జూన్ 15న ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. చైనా సైనికులు సరిహద్దు దాటి భారత్ భూభాగంలో ఉంటున్న సైనికులతో గొడవలకు దిగారు. బలమైన ఆయుధాలను వెంట తెచ్చుకుని దాడులు చేశారు. ఇటు భారత సైనికులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వీరోచిత పోరాటం చేశారు. చైనా సైనికులకు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. ఈ దాడుల్లో 20 మంది భారత సైనికులు చనిపోయినట్టు మన దేశ ఆర్మీ అధికారికంగానే ప్రకటించింది. 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్, తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు ఆ దాడుల్లోనే వీరమరణం పొందారు. ఐతే చైనా మాత్రం తమ వైపు కేవలం ఐదుగురే మరణించారని చెప్పింది. కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక భారీ సంఖ్యలోనే ప్రాణనష్టం జరిగిందని తెలిపింది. రష్యన్ మీడియా కూడా 45 మంది చైనా సైనికులు మరణించి ఉంటారని కథనాలను ప్రసారం చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India-China, Indian Army, Indo China Tension, Ladakh