Environment activist: చెట్లను కాపాడేందుకు ఈ పర్యావరణవేత్త ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 

ప్రతీకాత్మకచిత్రం

ఆయన ఓ అడుగు ముందుకేసి రోడ్డు వేసే సమయంలో నరికేసే చెట్లపై దేవతా చిత్రాలను అతికిస్తున్నారు. ఇలా అతికించడం ద్వారా వాటిని కొట్టేయడానికి వెనుకాడతారని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. స్థానిక గ్రామస్థులను కూడా అడవిని కాపాడేందుకు తనకు సాయం చేయమని ఆయన కోరుతున్నారు.

  • Share this:
భూమిపై రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. చెట్లను పెంచడం ద్వారా కాలుష్యాన్ని వీలైనంత వరకు తగ్గించవచ్చని ఎంత చెబుతున్నా వినేవారు చాలా తక్కువ మందే.. చెట్లను కొట్టి ఆ కలపను వివిధ పనుల కోసం ఉపయోగిస్తుండడం వల్ల అడవులు కూడా నశించిపోతున్నాయి. చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉంటుంది. ఇదే మన భూమిని కాపాడుకోవడానికి మనం పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన చర్య అని చెప్పుకోవచ్చు. పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లను కొట్టకుండా చేసేందుకు ఛత్తీస్ ఘడ్ కి చెందిన ఓ ఎన్విరాన్ మెంటల్ యాక్టివిస్ట్ కొత్త మార్గాన్ని కనుక్కన్నారు. చెట్లపై శివుడు, విష్ణువు వంటి దేవతా చిత్రాలను అతికిస్తున్నారు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ఛత్తీస్ ఘడ్ లోని బాలోడ్ జిల్లాలోని తారోడ్ నుంచి దైహాన్ వరకు కనీసం ఎనిమిది కిలో మీటర్ల దూరం రోడ్డు వేయాలని రోడ్డు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోడ్డు విస్తరణలో భాగంగా చాలా చెట్లు కొట్టేయాల్సి వస్తుందట. అయితే యాక్టివిస్ట్ వీరేంద్ర సింగ్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రోడ్డు రవాణా కావాలి కానీ అది చెట్లను కొట్టేసి పర్యావరణానికి హాని కలిగించి మాత్రం కాదు అన్నది ఆయన ఉద్దేశం.

దీని గురించి ఆయన మాట్లాడుతూ “ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 2900 చెట్లను కొట్టేయాల్సి ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ అసలు సంఖ్య అంతకంటే పది రెట్లు ఉంటుందని మేం భావిస్తున్నాం. కనీసం 20 వేల చెట్ల వరకు నరికేసి ఈ రోడ్డును వేస్తున్నారు. వాటిని మరో చోటికి తరలించడం కానీ.. వాటి బదులుగా మరో చోట మొక్కలు నాటడం కానీ వారు చేయడం లేదు. మాకు డెవలప్ మెంట్ కావాల్సిందే కానీ అడవులు నాశనం చేసి మాత్రం కాదు” అని వెల్లడించారు. అందుకే ఆయన ఓ అడుగు ముందుకేసి రోడ్డు వేసే సమయంలో నరికేసే చెట్లపై దేవతా చిత్రాలను అతికిస్తున్నారు. ఇలా అతికించడం ద్వారా వాటిని కొట్టేయడానికి వెనుకాడతారని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. స్థానిక గ్రామస్థులను కూడా అడవిని కాపాడేందుకు తనకు సాయం చేయమని ఆయన కోరుతున్నారు. పర్యావరణాన్ని కాపాడడం ఎంతో అవసరం అని వెల్లడిస్తూ.. పర్యావరణ సమతౌల్యత లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా ఆయన సూచిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వంటివన్నీ అడవులను కొట్టేయడం వల్లనే ఎదురవుతున్నాయి. అందుకే మనం వీలైనంత ఎక్కువగా మొక్కల్ని పెంచి ఈ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన వెల్లడిస్తున్నారు.



గతంలో చిప్కో మూమెంట్ లో భాగంగా అడవి పక్కనున్న గ్రామాల ప్రజలు తమ గ్రామాల పక్కనున్న అడవిని కాపాడుకున్నట్లే ఇప్పుడు కూడా చెట్లకు రక్షాసూత్రాలు కడుతూ, నరికివేయొద్దని బ్యానర్లు కడుతూ.. దేవతా చిత్రాలు అతికిస్తూ ఆ చెట్లను నరికివేయొద్దని కోరుతున్నారు.
Published by:Krishna Adithya
First published: