బాగా దాహంతో ఉన్న ఓ చిరుత తన పిల్లలతో కలిసి చిన్న నీటి గుంత దగ్గరకు వెళ్లడమే అది చేసిన నేరమైంది. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఊహించని చిరుత తన పిల్లల్లో ఒకదాన్ని కోల్పోవాల్సి వచ్చింది. చిరుత తన పిల్లలతో కలిసి దాహాన్ని తీర్చుకుంటుండగా నీటి మాటున దాగి ఉన్న మొసలి.. ఓ పిల్లపై దాడి చేసింది. దాడిచేయడమే కాదు ఒక్కసారిగా దాన్ని సరస్సు మధ్యలోకి తీసుకెళ్లి తినేసింది. తన పిల్ల కోసం ఎదురుచూస్తూ ఉండిపోవడం ఆ తల్లి చిరుత వంతయ్యింది. మనిషి ఊహకందని ఇలాంటి ఘటనలు అడవుల్లో చాలా జరుగుతుంటాయి. దక్షిణాఫ్రికాలోని ఓ అడవిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని అడవిలో ఓ చిరుతపులి తన రెండు పిల్లలతో ఒక నీటి గుంత దగ్గరకు వెళ్లింది. అందులో మొసలి ఉండడాన్ని అది గమనించింది. అయితే అప్పటికే బాగా దాహంతో ఉన్న ఆ పులి నీరు తాగడానికి దాని ఒడ్డుకు వెళ్లింది. దానిని అనుసరిస్తూ మొగ చిరుతపిల్ల నీరు తాగుతుండగా, అప్పటికే మాటువేసి ఉన్న మొసలి క్షణాల్లో దాని మెడను పట్టుకుంది.
ఆ చిరుత పిల్ల తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అది సఫలం కాలేకపోయింది. ఈ క్రమంలో మొసలి దానిని నీటి మధ్యలోకి తీసుకెళ్లి తినేసింది. ఒడ్డునే ఉన్న తల్లి చిరుత నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. తన పిల్ల బయటికి వస్తుందేమేనని కొద్ది సేపు అక్కడే తిరుగుతూ ఉండిపోయింది.
ఈ ఘటనను వైల్డ్ఎర్త్ గైడ్ బుసాని మషైలి తన కెమెరాలో బంధించారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 1.52 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతున్నది. ఈ వీడియోకు ఇప్పటికే 10 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి.
Published by:Sridhar Reddy
First published:December 24, 2020, 22:24 IST