news18-telugu
Updated: November 12, 2020, 3:18 PM IST
బస్సు వైపు దూసుకొస్తున్న ఏనుగు(Photo:Twitter)
సాధారణంగా మనం ఏనుగును సినిమాలు, సర్కస్ లు, జూలలో చూసి తెగ ఆనందిస్తుంటాం. అదే ఎనుగు ఎదురుగా వస్తే.. వామ్మో ఊహించుకుంటేనే వణుకు వస్తుంది కదూ! చాలా సార్లు అటవీ పరిసర ప్రాంతాల్లోని పల్లెల్లోకి గజరాజులు వచ్చి బీభత్సం సృష్టిస్తుంటాయి. స్థానికులపై దాడులు చేస్తుంటాయి. అలాంటి వీడియోలను చూస్తేనే సగం ప్రాణం పోతుంది. అయితే ఆకలితో ఉన్న ఓ ఏనుగు రోడ్డుపై వచ్చి వాహనదారులను కాసేపు వణికించింది. ఏకంగా ఓ బస్సును ఆపింది. ఆ బస్సులో అరటి పండ్లు ఉన్న విషయం దానికి ఎలా తెలిసిందో ఏమో కానీ.. డ్రైవర్ సీటు వైపు ఉన్న నుంచి తొండాన్ని లోపలికి పెట్టింది. అతని పక్కన ఉన్న అరటి పండ్లను తీసుకోవడానికి ప్రయత్నించింది.
తన మీది నుంచి తొండం లోపలికి రావడంతో అతడు భయపడిపోయాడు. తొండాన్ని తోయడానికి అతడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో డ్రైవర్ పక్కన ఉన్న ఓ వ్యక్తి వేగంగా స్పందించాడు. ఆ పండ్లను తీసి ఆ ఏనుగు నోటికి అందించాడు. దీంతో ఆ ఏనుగు ఆ అరటి పండ్లు తిసుకుని వారిని విడిచిపెట్టింది. దీంతో హమ్మయ్య అంటూ వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన 2018లో శ్రీలంకలోని కటరంగామా ప్రాంతంలో జరిగింది. ఆ వీడియోను ఇప్పుడు ప్రవీణ్ కశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేయడంతో మళ్లీ వైరల్ గా మారింది.
Published by:
Nikhil Kumar S
First published:
November 12, 2020, 3:10 PM IST