Caught on Camera: అది ఇంగ్లండ్‌లోని కాంటెర్బరీ కాథెడ్రల్. అక్కడున్న టైగర్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. టైగర్ అంటే పులి కాదు. గండు పిల్లి. చూడ్డానికి పెద్దగా ఉందని దానికి అలా పేరు పెట్టారు. తాజాగా అక్కడో చోరీ జరిగింది. అది కూడా లైవ్‌లో అందరూ చూస్తుండగా. చోరీ చేసింది ఎవరో కాదు టైగర్. కరోనా వచ్చాక... అక్కడ ప్రార్థనలు వర్చువల్ రూపంలో జరుగుతున్నాయి. తాజాగా కాంటెర్బరీ డీన్... ప్రార్థన చేస్తూ... ఓ సందేశం చదువుతున్నారు. ఆయన పక్కనే బెంచ్‌పై పిల్లి కోసం పాలు ఉన్నాయి. డీన్ కోసం టేబుల్‌పై పాన్ కేక్స్ ఉన్నాయి. ఓ పక్క లైవ్ జరుగుతుంటే... అదేమీ తెలియని ఆ పిల్లికి పాలు నచ్చలేదు. మెల్లగా టేబుల్ ఎక్కి... పాన్ కేకులను చూసింది. అవి దానికి బాగా నచ్చాయి. ఓ కేక్ నోట కరిచింది. అలా దాన్ని చోరీ చేసింది.
ఓవైపు సందేశం ఇస్తూనే మరోవైపు పిల్లిని అల్లరి చెయ్యనివ్వకుండా ఓదార్చారు డీన్. కానీ ఆ పిల్లి... తన పనిలో తాను ఉంది. కేకులను చూడగానే దాని మనసు ఆగలేదు. వీడియో చూడండి.
ప్రయర్ తర్వాత డీన్ డాక్టర్ రాబెర్ట్ విల్లీస్ టేబుల్ వైపు చూశారు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఓ ప్యాన్ కేక్ మాయమైందనీ... దాన్ని పిల్లి చోరీ చేసిందని. ఆయనకు నవ్వు వచ్చేసింది. "టైగర్‌కి బ్రేక్ ఫాస్ట్ దొరికింది. ఇవాళ ప్యాన్ కేక్ తింటోంది. అలా చేసిందని మేమేమీ అనుకోవట్లేదు" అని ఆయన నవ్వేశారు.
ఈ టైగర్ గతేడాది కూడా ఇలాంటి చిలిపి పనే చేసింది. అప్పట్లో డీన్ పక్కన పిల్లి కోసం పాలు ఉంచారు. ఆ పాలు తాగడానికి అది డీన్ ఒళ్లో వాలింది. అప్పట్లో అదో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియోని కూడా చూసి నెటిజన్లు నవ్వుతున్నారు. దొంగ పిల్లి అని సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఈ పిల్లి ఇలాంటి మరిన్ని చిలిపి పనులు చెయ్యాలనీ... వాటిని తాము చూడాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి:Last Saturday: నెలలో చివరి శనివారం ఈ వస్తువులు కొనకండి... ఎందుకంటే...
ఈ క్యాథడ్రెల్లో ఈ ఒక్క పిల్లే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అలా అలా తిరుగుతూ వచ్చిన వారికి ఆనందం కలిగిస్తున్నాయి.
Published by:Krishna Kumar N
First published:February 22, 2021, 12:22 IST