Cat Mourning: తోబుట్టువు మరణంతో కుంగిపోయిన పిల్లి.. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

Photo Credit : Face Book

Cat Mourning: సాధారణంగా ఇలాంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ కేవలం మనుషుల్లో మాత్రమే ఉంటుందని భావిస్తుంటాం. కానీ మాట్లాడలేకపోయినా.. మూగజీవాలు సైతం తమ రక్త సంబంధీకులు చనిపోతే దుఃఖిస్తాయని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది.

  • Share this:
ప్రియమైన వారు మరణించినప్పుడు అనుభవించే వ్యధను మాటల్లో వర్ణించలేం. ఇక తోడబుట్టిన వారు మృత్యువు చాలిస్తే ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మానవులు కన్నీటి పర్యంతమవుతుంటారు. ఆ విషాదం నుంచి బయట పడడానికి ఎవరికైనా చాలా సమయం పడుతుంది. సాధారణంగా ఇలాంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ కేవలం మనుషుల్లో మాత్రమే ఉంటుందని భావిస్తుంటాం. కానీ మాట్లాడలేకపోయినా.. మూగజీవాలు సైతం తమ రక్త సంబంధీకులు చనిపోతే దుఃఖిస్తాయని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. తాజాగా ఒక పిల్లి తమకు కూడా ప్రేమ, ఆప్యాయత, బాధ ఉంటాయని చెప్పకనే చెప్పింది. తనతో పాటు జన్మించిన పిల్లి చనిపోవడంతో, దాని సమాధి వద్ద కూర్చొని కన్నీంటిపర్యంతమైంది. గుజరాత్లోని సూరత్ నగరంలో లియో అనే ఒక పర్షియన్ పిల్లి దాని తోబుట్టువు కోకో చనిపోవడంతో తీవ్ర విషాదంలో మునిగి తేలుతోంది. సెప్టెంబర్ 23న కోకో మృతదేహాన్ని పూడ్చి పెట్టగా.. ఆరోజు లియో.. కోకో సమాధి పక్కన గంటల తరబడి కూర్చొని తీవ్ర విషాదం వ్యక్తం చేసింది.

దాని ప్రవర్తన చూసి యజమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. లియో పట్ల ప్రగాఢ సానుభూతి చూపిస్తున్నారు. ఈ పిల్లి దుఃఖిస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయ్. ఇది చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.వల్సాద్‌లో రైల్వే ఉద్యోగి మున్నవర్ షేక్ కుమారుడు ఫైజల్ నాలుగేళ్ల క్రితం రెండు పిల్లులను స్నేహితుల నుంచి బహుమతిగా పొందాడు. ఈ రెండు పిల్లులు బొమ్మలాంటి ఫేస్ (doll face) కలిగి ఉండే పర్షియన్ పిల్లి జాతికి చెందినవి. ఈ పిల్లులు ఒకే తల్లికి పుట్టినవి కావడంతో రెండు కలిసి ఎంతో హాయిగా ఆడుకునేవి. వాటికి లియో, కోకో అని పేరు పెట్టారు. అయితే దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం ఫైజల్ నివాసం నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన కోకో మళ్లీ తిరిగి రాలేదు. దాంతో మున్నవర్ కుటుంబం.. ఆ పిల్లిని ఎవరైనా దొంగలించి ఉంటారా అని ఆందోళన పడ్డారు. ఎంత వెతికినా దొరకని ఆ పిల్లి ఆచూకీ సుమారు ఆరు నెలల క్రితం లభ్యమైంది.వల్సాద్‌లోని ఒక కుటుంబం కోకోని పెంచుతున్నట్లు వారికి సమాచారం అందింది. ఆ కుటుంబం నుంచి కోకోను తిరిగి తీసుకురావడానికి మున్నవర్ సభ్యులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయానికి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోకో మున్నవర్ ఇంటికి రావడానికి నిరాకరించింది. ఎలాగోలా కుటుంబ సభ్యులు దాన్ని రెండు ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి తీసుకొచ్చారు. అయితే తన తోడబుట్టిన కోకో రాకతో లియో చాలా సంతోషించింది. సెకండ్లలోనే తన తోడబుట్టిన కోకోని కనిపెట్టిన ఇది మళ్ళీ దానితో కలిసి ఆడుకోవడం ప్రారంభించింది.కానీ కోకో అనారోగ్య సమస్యలతో రోజురోజుకీ క్షీణించింది. వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలోనే కోకో కన్నుమూసింది. దాంతో సభ్యులు కోకో బాడీని నిశ్శబ్దంగా ఇంటికి తీసుకొచ్చారు. గత గురువారం కాంపౌండ్‌లో ఖననం చేశారు. లియోకి కోకో మరణం గురించి గానీ ఖననం గురించి గానీ తెలియకుండా జాగ్రత్త పడ్డామని.. కానీ లియో ఏదో కీడు జరిగినట్టు శంకించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

కొన్ని గంటల తర్వాత అది కోకో సమాధి దగ్గరకి వచ్చి కూర్చొని ఆవేదన వ్యక్తం చేసిందని ఫైజల్ వెల్లడించారు. దాని ప్రవర్తన చూసి తాము ఆశ్చర్యపోయామని.. అలాగే చాలా బాధపడ్డామని తెలిపారు. ప్రస్తుతం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పారు. ఈ పిల్లిని చూసేందుకు స్థానికులు కూడా తరలివస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: