పెంపుడు జంతువులకు ఉన్నంత విశ్వాసం మనుషులకు ఉండదని చాలామంది అంటారు. దీన్ని చాలా సంఘటనలు నిరూపించాయి. విశ్వాసం విషయంలో తనకు ఎవరూ సాటి రాదని నిరూపించింది ఒక పిల్లి. తనను చేరదీసిన ఒక కుటుంబం కోసం అది ఏకంగా ప్రాణాలనే త్యాగం చేసింది. విశ్వాసానికి అసలైన అర్థం చెప్పిన ఆర్థర్ అనే పిల్లికి సంబంధించిన వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఒక ప్రమాదకరమైన విషసర్పం కాటుకు గురికాకుండా తన యజమాని పిల్లలను అది కాపాడింది.
ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. అత్యంత ప్రాణాంతకమైన పాముతో పిల్లి పోరాడింది. ఇద్దరు చిన్నారులు పెరట్లో ఆడుకుంటున్న సమయంలో ఓ పాము ఇంట్లోకి వచ్చింది. అది నేరుగా పిల్లల వైపు వెళ్లింది. దీన్ని గమనించిన పిల్లి పాముతో పోరాడింది. కష్టపడి మొత్తానికి పామును చంపేసింది. కానీ ఈ పోరాటంలో పాము కాటుకు గురి కావడంతో ఆ పిల్లి కూడా మరణించింది. ఆస్ట్రేలియాలో అత్యంత విషపూరితమైన ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్.. ఆర్థర్‌ను కాటువేసింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను యానిమల్ ఎమర్జెన్సీ సర్వీస్ సంస్థ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. పాము కాటు నుంచి పిల్లలను కాపాడే క్రమంలో ఆర్థర్ ప్రాణాలు కోల్పోయిందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. పాముతో పోరాడే సమయంలో పిల్లి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. కానీ వెంటనే లేచి మళ్లీ దాన్ని ఎదుర్కొంది. పిల్లలు పెరట్లో నుంచి బయటకు వచ్చేంత వరకు ఇంటి యజమాని ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. పాము పిల్లిని కాటువేసిందనే విషయాన్ని వారు గమనించలేదు. మరుసటి రోజు ఉదయం ఆర్థర్ స్పృహ కోల్పోయిన తరువాత కానీ వారికి అసలు విషయం అర్థం కాలేదు. పిల్లిని వెంటనే హాస్పిటల్‌కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. విషం ప్రభావం వల్ల అది చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. పెంపుడు జంతువులు తమ యజమానుల కోసం ఎంత త్యాగం చేస్తాయో ఈ సంఘటన ద్వారా తెలుస్తోందని యానిమల్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.
పిల్లి చేసిన పనిని దాని యజమాని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. పిల్లల ప్రాణాలను కాపాడినందుకు దానికి వారు కృతజ్ఞులుగా ఉన్నారు. కానీ ఆర్థర్ మాత్రం ఇప్పుడు ప్రాణాలతో లేదని యానిమల్ ఎమర్జెన్సీ సర్వీస్ పేర్కొంది. ఈ సంస్థ ప్రతినిధులు ఇంతకు ముందు ఓసారి ప్రమాదంలో గాయపడిన ఆర్థర్‌కు సేవలదించడం విశేషం. ఆస్ట్రేలియాలో ఎన్నో రకాల విష సర్పాలు ఉన్నాయి. వీటిల్లో చాలావరకు ప్రాణంతకమైనవే ఉన్నాయి. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అనేది ఆ దేశంలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతుల్లో రెండోది. ఇది చాలా చురుగ్గా ఉంటుంది. తనపై దాడి చేసే ప్రాణులకు క్షణాల్లోనే మట్టికరిపిస్తుందని ఆస్ట్రేలియన్ జియోగ్రాఫిక్ సంస్థ తెలిపింది. ఈ పాము విషం వల్ల ఇతర జీవుల నాడీ వ్యవస్థ పట్టు కోల్పోతుంది. దీంతో పక్షవాతం వచ్చి రక్తం గడ్డకట్టడం ఆగిపోతుంది. ఫలితంగా ఇది కాటు వేసిన కొన్ని నిమిషాల్లోనే బాధితులు కన్నుమూసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Snake, Snake bite