• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CANADA HOTEL INSTALLS MAHATMA GANDHIS ICE STATUE SEE PHOTOS BA GH

మహాత్మాగాంధీకి మంచు విగ్రహం.. కెనడా రెస్టారెంట్‌లో ఏర్పాటు... ఎందుకంటే..

మహాత్మాగాంధీకి మంచు విగ్రహం.. కెనడా రెస్టారెంట్‌లో ఏర్పాటు... ఎందుకంటే..

మంచుతో తయారు చేసిన గాంధీ విగ్రహం (Image: @IndiainToronto)

కెనడాలోని భారతీయులు ఈ మంచు విగ్రహాన్ని చూసేందుకు హోటల్​కు తరలి వెళ్తున్నారు. కెనడాలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అక్కడి భారతీయులు చెబుతున్నారు. కాగా, విగ్రహ ఏర్పాటు చేసిన హోటల్ డి గ్లేస్ కెనడాలో ఒక ప్రసిద్ధ హోటల్​గా పేరొందింది.

  • Share this:
భారత జాతిపిత మహాత్మా గాంధీకి కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని ‘డీ గ్లేస్’​ అనే ప్రముఖ హోటల్​లో దాదాపు ఏడు అడుగుల గాంధీ మంచు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2021 ఆగస్ట్​ 15న భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో ఈ శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు హోటల్​ నిర్వాహకులు తెలిపారు. భారత్​లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి నెలల ముందు గానే, కెనడాలో గాంధీ మంచు విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలను ప్రారంభించడం విశేషం.

ఏడు అడుగుల పొడవు గల ఈ అందమైన విగ్రహాన్ని కెనడాకు చెందిన మంచు శిల్పి మార్క్​ లెఫర్​ అనే కళాకారుడు చెక్కాడు. లెబైర్ క్యూబెక్ నగరానికి చెందిన ఆయన ఒక ప్రముఖ మంచు విగ్రహ శిల్పి. గాంధీ మంచు విగ్రహం కోసం అతను తొమ్మిది బ్లాకుల మంచును ఉపయోగించాడు. ఈ విగ్రహ తయారీని కేవలం ఐదు గంటల్లో పూర్తి చేశాడు. విగ్రహ తయారీపై ఆయన మాట్లాడుతూ.. "అహింసా మార్గంలో స్వాతంత్రోద్యమాన్ని నడిపి భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షను నెరవేర్చిన మహాత్మా గాంధీ మంచు విగ్రహాన్ని తయారు చేయడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది." అని అన్నారు.



ఈ మంచు విగ్రహానికి సంబంధించిన ఫోటోలను టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం తన అధికారిక ట్విట్టర్లో అకౌంట్​ ద్వారా పోస్ట్ చేసింది. 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్' అనే హ్యాష్‌ట్యాగ్​తో.. "75వ భారత స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా క్యూబెక్‌లోని చారిత్రాత్మక హోటెల్​ డి గ్లేస్​లో మహాత్మా గాంధీ మంచు విగ్రహం ఏర్పాటు చేశాం. దీంతో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ ప్రారంభమైంది.’’ అంటూ పోస్ట్​ చేసింది.

సోషల్​ మీడియాలో ఫోటోలు వైరల్​..
కాగా, కెనడాలోని భారతీయులు ఈ మంచు విగ్రహాన్ని చూసేందుకు హోటల్​కు తరలి వెళ్తున్నారు. కెనడాలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అక్కడి భారతీయులు చెబుతున్నారు. కాగా, విగ్రహ ఏర్పాటు చేసిన హోటల్ డి గ్లేస్ కెనడాలో ఒక ప్రసిద్ధ హోటల్​గా పేరొందింది. కెనడాలోనే కాదు, ఉత్తర అమెరికాలో మొత్తంలో ఉన్న ఏకైక ఐస్ హోటల్ కూడా ఇదే కావడం విశేషం. అందువల్ల, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఈ హోటల్​లో ఏర్పాటు చేయడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, విగ్రహ ఏర్పాటుపై కెనడాలోని భారత కాన్సుల్ జనరల్ అపూర్వా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణతో ప్రారంభించాలనుకున్నాం. దీనిలో భాగంగానే ఒక ఐకానిక్ ప్రదేశంలో విగ్రహ ఏర్పాటు కోసం పరిశీలించాం. ప్రముఖ డి గ్లేస్​ హోటల్​ను సంప్రదించగానే, వారు హృదయపూర్వకంగా అంగీకరించి, మంచు విగ్రహాన్ని రూపొందించారు.”అని అన్నారు. కాగా, 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను 75 వారాలకు ముందుగానే అనగా మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు