BLACK FUNGUS: చికెన్​ తింటే బ్లాక్​ ఫంగస్​ వస్తుందా ?.. నిజమెంత ?

ప్రతీకాత్మకచిత్రం

BLACK FUNGUS: చికెన్​ తింటే బ్లాక్​ ఫంగస్​ వస్తుందా? ఫేక్ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చిన పీఐబి ఫాక్ట్​ చెక్​

  • Share this:
దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంటే ఇప్పుడు ముకోర్‌మైకోసిస్ లేదా బ్లాక్​ ఫంగస్​ అందర్నీ భయపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్న రోగులు బ్లాక్​ ఫంగస్​ బారిన పడి మరణిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే, గతంలో కరోనాపై రూమర్లు వినిపించినట్లే ఇప్పుడు బ్లాక్​ ఫంగస్​పై కూడా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఫంగస్​ పట్టిన ఉల్లిపాయతో బ్లాక్​ ఫంగస్​ వస్తుందని జోరుగా ప్రచారం జరగ్గా నిపుణులు దాన్ని కొట్టి పారేశారు. ఉల్లిపాయకు భూమిలోనే ఫంగస్​ వస్తుందని దాని వల్ల మనుషులకు సోకదని పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు చికెన్​ తింటే బ్లాక్​ ఫంగస్​ వస్తుందని సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ దీన్ని ప్రచురించడంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది.

వైరల్ అవుతున్న పోస్ట్​లో ఉన్న వివరాలు పరిశీలిస్తే.. ‘కోళ్ల ఫారంల ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి చెందుతుంది. కొన్ని రోజుల పాటు చికెన్​ తినకపోవడమే మంచిది. చికెన్​కు దూరంగా ఉండండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను సురక్షితంగా కాపాడుకోండి’ అనే పోస్ట్​ వాట్సాప్​ గ్రూప్స్​లో వైరల్​ అవుతుంది. చాలా మంది ఇది నిజమా? కాదా? అని తెలుసుకోకుండానే ఇతరులకు షేర్​ చేస్తున్నారు. గతేడాది కరోనా ఫస్ట్​వేవ్​ సమయంలోనూ చికెన్​పై ఇలాంటి ప్రచారమే జరిగింది. చికెన్​ తింటే కరోనా సోకుతుందన్న ప్రచారంతో వినియోగం భారీగా పడిపోయింది. ఫలితంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. దీని నుంచి కోలుకోవడానికి పౌల్ట్రీ పరిశ్రమకు చాలా సమయమే పట్టింది.

ఇప్పుడు బ్లాక్​ ఫంగస్​ విషయంలోనూ ఇలాంటి ఫేక్​ న్యూస్​ వైరల్ అవుతోంది. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఫాక్ట్​ చెక్ స్పష్టతనిచ్చింది. “చికెన్​ తింటే బ్లాక్​ ఫంగస్​ వస్తుందన్న వార్తల్లో నిజం లేదు. ఈ ఇన్ఫెక్షన్ కోళ్ల నుంచి మానవులకు వ్యాపిస్తుందన్న దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల నిస్సందేహంగా చికెన్​ తినవచ్చు" అని ట్వీట్ చేసింది.

గతంలోనూ ఇలాంటి ఫేక్​ ప్రచారం..
కాగా, ఈ అంశంపై తాజాగా ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) సీనియర్​ సైంటిస్ట్​ డాక్టర్​ అపర్ణ ముఖర్జీ స్పందించారు. వాతావరణంలో ఉండే బ్లాక్​ ఫంగస్​ కోళ్లకి వస్తుందని, ఆ కోళ్ల ద్వారా మనుషులకు సోకుతుందన్న వాదనలో అర్థం లేదని చెప్పారు. బ్లాక్​ ఫంగస్​ అంటువ్యాధి కాదు, అలాంటప్పుడు జంతువుల నుంచి కోళ్లకు ఎలా సోకుతుందని ఆమె అన్నారు. కాబట్టి చికెన్​ తినేందుకు భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, దేశంలో బ్లాక్​ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో చికిత్సా విధానాన్ని రూపొందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. దీని చికిత్స కోసం లిపోసోమల్ ఆంఫోటెరిసిన్ బి ఔషధ పంపిణీపై ఒక విధానాన్ని రూపొందించాలని, వాటి కొరత లేకుండా చూడాలని ఆదేశించింది.
Published by:Krishna Adithya
First published: