• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BRITISH LADY FIGHTS WITH CROCODILE AND PUNCHES ON ITS FACE TO SAVE HER SISTER IN MEXICO SK

Fight with Crocodile: మొసలితో అక్క పోరాటం.. ముఖంపై పిడిగుద్దులు.. చెల్లి కోసం సాహసం..

Fight with Crocodile: మొసలితో అక్క పోరాటం.. ముఖంపై పిడిగుద్దులు.. చెల్లి కోసం సాహసం..

ప్రతీకాత్మక చిత్రం

28 ఏళ్ల ఓ యువతి మొసలితో పోరాడింది. చెల్లిపై దాడిచేసిన మొసలిని ఎడా పెడా వాయించింది. దాని ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. అనంతరం చెల్లిని ఒడ్డుకు చేర్చింది. ఐతే అప్పటికే ఆమెకు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Share this:
    మొసలి.. చాలా క్రూరమైన ప్రాణి. దానిని చూస్తేనే భయంకరంగా ఉంటుంది. జూలో అత్యంత భద్రత మధ్య ఉన్నప్పటికీ.. మొసలి వైపు వెళ్లేందుకు కొందరు జంకుతుంటారు. మొసలి అంటే అంత భయం. కానీ ఓ యువతి మాత్రం మొసలితో పోరాడింది. అది కూడా నీటిలో..! చెల్లిపై దాడిచేసిన మొసలికి చుక్కలు చూపించింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించి.. చెల్లిని ప్రాణాలతో కాపాడుకుంది. మెక్సికోలో ఈ ఘటన జరిగింది. బ్రిటన్‌కు చెందిన ఓ ఫ్యామిలీ మెక్సికో పర్యటనకు వెళ్లింది. ఆ కుటుంబంలో జార్జియా, మెలిస్సా లారీ అనే కవల అమ్మాయిలు ఉన్నారు. వీరి వయసు 28 ఏళ్లు. వీరంతా మానియాల్టేపెక్ లాగూన్ ప్రాంతానికి వెళ్లారు. మెక్సికోలోని ప్యూర్టో ఎస్కాండిడో పట్టణానికి అది 16 కి.మీ.దూరంలో ఉంటుంది. తక్కువ లోతుండే ఆ చెరువులో దిగి అందరూ సరదాగా ఈత కొడుతున్నారు. కాసేపటికి మెలిసా కనిపించలేదు. కంగారుపడిన జార్జియా చెరువును మొత్తం గాలించింది. చివరకు ఓ మొసలి బారినపడిందని గుర్తించింది.

    తన చెల్లిని మొసలి నుంచి ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొసలితో పోరాడింది. దాని ముఖంపై పిడిగుద్దులు కురిపించి..చెల్లిని విడిపించింది. మొసలితో జరిగిన పోరాటంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మెలిసా ఆరోగ్యం విషమంగా ఉంది. కోమాలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. జార్జియా మాత్రం కోలుకుంటోందని చెప్పారు. వారు ఈత కొట్టేందుకు వెళ్లిన చెరువు చాలా ప్రమాదకరమైదని.. అందులో మొసళ్లు ఉంటాయని అధికారులు చెప్పారు. అసలు అందులోకి ఎందుకు వెళ్లారని తల్లిదండ్రులను ప్రశ్నించారు.

    తమ టూరిస్ట్ గైడ్ చెప్పడం వల్లే చెరువులోకి దిగినట్లు బాధితుల తల్లిదండ్రులు చెప్పారు. అది సురక్షితమైనదని, ఎవరూ భయపడవద్దని చెప్పడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని వారు వెల్లడించారు. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. ఐతే మెలిసాకు డైవింగ్, స్విమ్మింగ్ బాగా వచ్చని.. కానీ ఎదురు మొసలి కనిపించడంతో ఏం చేయాలో పాలుపోలేదని ఆమె సోదరి జార్జియా తెలిపింది. ఆ మాత్రం ట్రైనింగ్ ఉండడం వల్లే మొసలితో పోరాడగలిగామని ఆమె చెప్పుకొచ్చింది.

    మరోవైపు మెలిసా ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అయిన గాయాలు ప్రాణాంతకమా కాదా? అని తెలియడం లేదని అన్నారు. మెలిసా ప్రస్తుతం రక్తపు వాంతులు చేసుకుంటోందని.. ఊపిరితిత్తులకు చిల్లు పడవచ్చని వారు చెప్పారు. ఊపిరితిత్తులు నీటితో నిండిపోయినట్లు పేర్కొన్నారు. తమ కూతురు క్షేమంగా తిరిగొస్తే తమకు చాలని తెలిపారు. మెలిసా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని డాక్టర్లు వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, ఈ స్టోరీ గురించి తెలిసిన నెటిజన్లు జార్జియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొసలితో పోరాడిన ధీర వనిత అని కొనియాడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు