పెళ్లి వేడుకలో ఇదేం పని.. బంధువులందరి ముందే వధూవరులిద్దరూ.. వైరల్ వీడియోపై నెటిజన్ల సెటైర్లు

అగ్నిహోత్రం చుట్టూ డాన్స్ చేస్తున్న వధూవరులు

బాజా భజంత్రీలు, పెళ్లి మండపంలో అతిథులు, వేద మంత్రాలు, అతిథుల కోలాహలం, పదుల సంఖ్యలో ఆహార పదార్థాలతో పెళ్లి విందు.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో విశేషాలు. పెళ్లి వేడుక అంటేనే హడావిడి. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతోందంటే..

 • Share this:
  బాజా భజంత్రీలు, పెళ్లి మండపంలో అతిథులు, వేద మంత్రాలు, అతిథుల కోలాహలం, పదుల సంఖ్యలో ఆహార పదార్థాలతో పెళ్లి విందు.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో విశేషాలు. పెళ్లి వేడుక అంటేనే హడావిడి. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతోందంటే మరెన్నో ఆచారాలు పెళ్లి వేడుకలో కనిపిస్తుంటాయి. వధూవరులు కూడా చాలా నిష్టతో, నిబద్ధతతో ఆచారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ వధూవరుల ఇష్టా ఇష్టాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. పెళ్లికి ముందే జరిగే ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఎన్నో వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వింత వింత ఫోజులతో, చిత్ర విచిత్ర విన్యాసాలతో వార్తల్లోకెక్కుతున్నారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో జరిగిన ఓ తంతునకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

  పెళ్లిలో వధూవరులతో పవిత్రమైన అగ్నిహోత్రం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయించడం హిందూ వివాహాల్లో అనాదిగా వస్తున్న ఓ సంప్రదాయం. దీన్ని వధూవరులే కాదు, అంతా పవిత్రంగా భావిస్తుంటారు. అయితే ఓ జంట మాత్రం విచిత్రమైన నిర్వాకానికి పాల్పడింది. ఆ అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేయడం అటుంచి, దాని చుట్టూ డాన్స్ చేయడం మొదలు పెట్టిందా జంట. అక్కడ ఉన్న అతిథులు వారిని వారించడం వదిలి పెట్టి, చప్పట్లతో ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియోను బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ ఛైర్మన్, ఎండీ వేదాంత్ బిర్లా తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.  ‘ ఇది అసలు పెళ్లా..? లేక మన సంప్రదాయాలను వదిలివేయడమా? మీరిప్పుడు ప్రపంచంలోనే గొప్పవాళ్లుగా భావిస్తున్నారంటే అది మన సంస్కృతి, సంప్రదాయాల వల్లేనని మర్చిపోవద్దు‘ అని ఆయన తన ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ కామెంట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ కావడమే కాదు, ఓ డిబేట్ కు వేదిక అయింది. వధూవరులను విమర్శిస్తూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫొటోల కోసం, వైరల్ వీడియోల కోసమే ఇంతకు తెగిస్తున్నారంటూ కొందరు అంటోంటే.. మీ ఫొటోల కోసం విలువలను కాలరాస్తారా అని మరికొందరు విమర్శిస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: