Viral Video: కోమాలో కుమారుడు.. ఆశలు వదులుకున్న పేరెంట్స్.. అవయవ దానానికి ముందు ఊహించని ట్విస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల బ్రెయిన్​ డెడ్ అయిన ఒక యువకుడికి ఆపరేషన్​ చేస్తుండగా కళ్లు తెరిచాడు. అవయవ దానం ఆపరేషన్‌కు కొన్ని గంటల ముందు అతడు కళ్లు తెరిచి చూశాడు. ఈ విచిత్రమైన సంఘటనను చూసి వైద్యులు అవాక్కవుతున్నారు

  • Share this:
కొన్ని అరుదైన సంఘటనలు వైద్య రంగానికే సవాలు విసురుతుంటాయి. అటువంటి సంఘటనే తాజాగా చోటుచేసుకుంది. సాధారణంగా బ్రెయిన్​ డెడ్​ అయ్యి కోమాలోకి జారుకున్న వ్యక్తులను.. బతికున్న శవంగా భావిస్తుంటాం. వారు ఉలుకూ పలుకూ లేకుండా నిస్తేజంగా పడి ఉంటారు. అటువంటి వారు కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. దీంతో వారి అవయవాలను ఇతరులకు దానం చేయడం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపుతారు కుటుంబ సభ్యులు. అయితే, ఇటీవల బ్రెయిన్​ డెడ్ అయిన ఒక యువకుడికి ఆపరేషన్​ చేస్తుండగా కళ్లు తెరిచాడు. అవయవ దానం ఆపరేషన్‌కు కొన్ని గంటల ముందు అతడు కళ్లు తెరిచి చూశాడు. ఈ విచిత్రమైన సంఘటనను చూసి వైద్యులు అవాక్కవుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్​లోని స్టాఫోర్డ్‌షైర్‌ అనే పట్టణానికి చెందిన లూయిస్​ రాబర్ట్స్​ అనే 18 ఏళ్ల యువకున్ని మార్చి 13న వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి అతడికి అత్యాధునిక వైద్యం అందించనప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. కోమాలోకి జారుకున్న లూయిస్​కు వైద్యులు కృత్రిమ శ్వాస అందిస్తూ బతికుండేలా చేశారు. మార్చి 17న వైద్యులు మరోసారి అతడికి పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ, ఫలితం లేదు. అతడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. బతికే అవకాశాలు లేవని వైద్యులు డిక్లేర్ చేశారు. దీంతో, ఎలాగూ తమ కొడుకు దక్కడనుకున్న లూయిస్​ తల్లిదండ్రులు.. అతడి అవయవాలను అత్యవసర స్థితిలో ఉన్న ఏడుగురు వ్యక్తులకు దానం చేసేందుకు అంగీకరించారు. లూయిస్ అవయవాలను తొలగించేందుకు వైద్యులు అతడికి కృత్రిమ శ్వాస అందంచడం నిలిపివేశారు.

ఇక అవయవాలను తొలగించేందుకు ఒక గంట సమయం ఉందనగా.. లూయిస్ తనంతట తానే ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. ఊహించని ఈ ఘటనకు వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత ఈ విషయాన్ని లూయిస్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అతడు స్పృహలోకి రావడమే కాకుండా ప్రస్తుతం కాళ్లు చేతులు కూడా కదుపుతున్నాడు. అంతేకాక, కంటి రెప్పలు ఆడించడం, తలను అటూ ఇటూ తిప్పడం వంటివి కూడా చేస్తున్నాడు. కాగా, ఈ అద్భుత క్షణాన్ని లూయీస్​ సోదరి తన సెల్​ఫోన్​లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్​ చేయగా.. ఆ వీడియో క్షణాల్లో వైరల్​గా మారింది.

అతడు, పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా, సోషల్​ మీడియా ద్వారా ఈ విషయం ప్రజలకు తెలియడంతో అతడి వైద్యానికయ్యే ఖర్చులను చెల్లించడానికి, ప్రజలు ‘గో ఫండ్​ మీ’ పేరిట ఫండ్​ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి లూయిస్ కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. లూయిస్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే, బ్లాక్‌షా మూర్‌లోని లీక్ హైస్కూల్​లో లూయిస్ చదివాడు. అతడు తన వ్యాన్​లో హార్టింగ్టన్ స్ట్రీట్‌ జంక్షన్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ఒక వాహనం అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో లూయిస్​ తలకు బలమైన గాయాలై.. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. కాగా, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని స్టాఫోర్డ్‌షైర్ పోలీసులు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published: