యూకే (United Kingdom)లో కొత్త రకం కరోనా వైరస్ అల్లకల్లోలం రేపుతోంది. సాధారణ కోవిడ్ 19 కంటే 75శాతం అధికంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌తో లింక్‌లు కట్ చేశాయి. యూకేకు రాకపోకలు సాగించే విమానాలపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసులు క్రిస్మస్ పండగను సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికి మై బ్యాగేజ్ అనే సంస్థ శుభవార్త తెలిపింది. బ్రిటన్‌లో ఉండే స్వచ్ఛమైన గాలిని ప్రపంచదేశాల్లో ఉన్న బ్రిటన్ వాసులకు అందిస్తామని పేర్కొంది. నచ్చిన ప్రాంతాల నుంచి గాలిని సేకరించి.. దాన్ని బాటిల్స్‌లో నింపి.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పంపిస్తామని ప్రకటించింది.
మై బ్యాగేజ్ (My Baggage) సంస్థ ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ నుంచి స్వచ్ఛమైన గాలిని సేకరిస్తోంది. ఈ స్వచ్ఛమైన గాలిని బాటిల్స్‌లో నింపి అమ్మకాలు చేపట్టింది. 500 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఈ ఫ్రెష్ ఎయిర్ బాటిల్స్ లభిస్తాయి. బాటిల్స్ కార్క్ ఓపెన్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వచ్ఛమైన గాలిని, అందులోని పరిమళాన్ని ఆస్వాదించవచ్చు. కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే కాదు.. అందులో పలు రకాల ఫ్లేవర్స్ కూడా అందిస్తోంది. చేపల వాసన, చిప్స్ వాసన, పంట పొలాల పరిమళాలు.. ఇలా ఏది కోరితే ఆ అరోమాను నింపి అందజేస్తారు. ఇంటిపై బెంగ (Homesickness) పెట్టుకున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఈ బాటిల్స్‌ను విక్రయిస్తున్నారు.
ఇంతకు ఈ ఫ్రెష్ ఎయిర్ బాటిల్స్ ధర ఎంత తెలుసా? ఒక్క 500 ml బాటిల్‌ను 25 పౌండ్లకు అమ్ముతున్నారు. అంటే భారత కరెన్సీలో రూ.2494. అదే లీటర్ ఫ్రెష్ ఎయిర్ కావాలంటే దాదాపు రూ.5వేలు చెల్లించాల్సిందే.
కాగా, బాటిల్స్‌లో ఫ్రెష్ ఎయిర్ అమ్మడం ఇదే తొలిసారి కాదు. స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్‌బ్రీజ్ కంపెనీ 2018 నుంచి స్విస్ పర్వత ప్రాంతాల్లోని గాలిని బాటిల్స్‌లో నింపి అమ్ముతోంది. ఇక కెనడాకు చెందిన విటాలిటీ ఎయిర్ కంపెనీ రాకీ పర్వతాల నుంచి గాలిని సేకరించి చైనాకు అమ్మకాలు జరుపుతోంది. రెండు 8 లీటర్ల బాటిల్ ప్యాకెట్‌ను 52.99 డాలర్లు (దాదాపు రూ.4వేలు)లకు విక్రయిస్తున్నారు. అదే గాలిని స్విస్‌బ్రీజ్ కంపెనీ 20 డాలర్లు (దాదాపు రూ.1500)లకు అమ్ముతోంది.
Published by:Shiva Kumar Addula
First published:December 24, 2020, 10:18 IST