మనసుంటే మార్గం ఉంటుంది. అయితే ఒకోసారి మనం ఎంచుకునే మార్గం మన మనసునూ చాటుతుంది. అందుకే సామాజిక బాధ్యత ఎక్కువగా ఉన్న వారు తమ తోటివారికి సాయపడేందుకు ఎంతో రిస్క్ తీసుకుంటారు. అందరి కోసం మేము అంటూ విభిన్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సామాజిక బాధ్యత లక్ష్యంతో ఒక అమెరికన్ చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటోంది. విరాళాల సేకరణ కోసం ఓ వ్యక్తి ఒంటరిగా ఓ విచిత్రమైన గుండ్రటి పాత్రలో సముద్రంపై ప్రయాణిస్తూ ఒడ్డుకు కొట్టుకురావడం సంచలనంగా మారింది. ఇళ్ళు లేని పేదల కోసం అతడు ఈ ప్రయత్నం చేశాడట. ఆ వ్యక్తి వింతగా ఉన్న ఒక రకమైన పాత్రలో ఒడ్డుకు కొట్టుకురావడాన్ని గమనించిన స్థానికులు, విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
సెంట్రల్ ఫ్లోరిడాకు చెందిన రెజా బలూచి అనే వ్యక్తి విరాళాల సేకరణకోసం ఏదైనా ఓ వింత ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఇళ్ళు లేనివారి కోసం నిధులు సేకరించడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా ఓ గుండ్రటి పెద్ద పాత్రను సముద్రంపై ప్రయాణించేందుకు అనుకూలంగా మార్చాడు. ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ వరకు వెళ్లాలనే లక్ష్యంతో ఆ పాత్రలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కొన్ని సమస్యలకు గురయ్యాడు. ఫలితంగా తిరిగి ఫ్లోరిడా సముద్ర తీరంలోని వేరే బీచ్‌కు కొట్టుకొచ్చాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఏదో వింత వస్తువు ఒడ్డుకు కొట్టుకు వచ్చిందంటూ ఫ్లాగ్లర్ కౌంటీ డిప్యూటీకి సమాచారమిచ్చారు. దీంతో అధికారులు హుటాహుటిని సముద్రపు ఒడ్డుకు చేరుకుని ఆ వింత పాత్రను పరిశీలించగా అందులో రెజా బలూచి దర్శనమిచ్చాడు. అయితే అతను అందులో సురక్షితంగానే ఉండటంతో అధికారులు అతనిని విచారించారు. నిరాశ్రయుల కోసం డబ్బును సేకరించేందుకు తాను ఈ పాత్రను తయారుచేసుకున్నానని తెలిపాడు. తాను న్యూయార్క్‌కు చేరుకోవాలనుకున్నానని కానీ కొన్ని అవాంతరాలవల్ల ఒడ్డకు కొట్టుకొచ్చానని చెప్పాడు.
నిరాశ్రయుల కోసమే కాకుండా, కోస్ట్ గార్డ్, పోలీసులు, అగ్నిమాపక శాఖల కోసం కూడా నిధులు సేకరించడం తన లక్ష్యమని బలూచి చెప్పాడు. ఈ ఉదంతం తరువాత ఫ్లాగ్లర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తన ఫేస్‌బుక్ పేజీలో ఈ వింత ఓడ ఫోటోలను పంచుకుంది. అలాగే ఈ సంఘటన గురించి తమకు తెలిపిన పౌరులకు కృతజ్ఞతలు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending