Horse Birthday: సాయంత్రం చేతక్ తరఫున గోలూ కేక్ కట్ చేసి టపాసులు పేల్చాడు. ఈ వేడుకలకు చాలామందిని ఆహ్వానించాడు. వారందరికీ భోజనాలు పెట్టించాడు. ఈ పార్టీలో శాకాహార, మాంసాహార వంటకాలు వడ్డించడం విశేషం.
పెంపుడు జంతువులపై ఉండే ప్రేమను యజమానులు ప్రత్యేకంగా చాటుకుంటారు. చాలామంది ప్రజలు కుక్కలు లేదా పిల్లులను పెంచుకుంటారు. మన దేశంలో గుర్రాలను పెంచుకునే వారు కూడా ఉన్నారు. బిహార్‌లోని సహర్సా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన గుర్రం పుట్టినరోజును గొప్పగా నిర్వహించి వార్తల్లో నిలుస్తున్నాడు. అతడు పెంచుకుంటున్న గుర్రం బర్త్‌డే సందర్భంగా పౌండ్లు (సుమారు 22.5 కేజీలు) కేకు కోశాడు. చుటుపక్కల వారిని ఆహ్వానించి భోజనాలు కూడా పెట్టించడం విశేషం. సహర్సా జిల్లాలోని పంచవతి చౌక్ ప్రాంతానికి చెందిన రజనీష్ కుమార్ అలియాస్ గోలూ యాదవ్ ఒక గుర్రాన్ని పెంచుకుంటున్నాడు. దానికి చేతక్ అనే పేరు పెట్టాడు. చేతక్ రెండో పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం వేడుకలు నిర్వహించాడు. చేతక్‌ను గోలూ తన సొంత బిడ్డలాగే చూసుకోవడం విశేషం.
గుర్రానికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు గోలూ దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. చేతక్ మొదటి పుట్టిన రోజును కూడా ఇలాగే చేశాడు. పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉదయం గుర్రానికి స్నానం చేయించాడు. ప్రత్యేకంగా ఒక బర్త్‌డే కేకును కూడా తయారు చేయించారు. దాన్ని చేతక్ ముందు ఉంచారు. కేక్ మీద గుర్రం ఫోటో, దాని పేరు కూడా రాయించారు. ఆ రోజు సాయంత్రం చేతక్ తరఫున గోలూ కేక్ కట్ చేసి టపాసులు పేల్చాడు. ఈ వేడుకలకు చాలామందిని ఆహ్వానించాడు. వారందరికీ భోజనాలు పెట్టించాడు. ఈ పార్టీలో శాకాహార, మాంసాహార వంటకాలు వడ్డించడం విశేషం. తాను ఇప్పటి వరకు తన సొంత పుట్టినరోజును జరుపుకోలేదని గోలూ చెప్పాడు. కానీ ప్రతి సంవత్సరం చేతక్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తానన్నాడు.
చేతక్‌ను ఒక జంతువుగా ఎప్పుడూ చూడలేదని గోలు యాదవ్ చెబుతున్నాడు. అది తన కుటుంబంలో భాగమని చెప్పాడు. తన పిల్లల కంటే కూడా దాన్ని ఎక్కువగా ప్రేమించానని తెలిపాడు. ఈ రోజుల్లో మనుషులకంటే జంతువులే విశ్వాసంగా ఉంటున్నాయని వివరించాడు. జీవ హింసను అడ్డుకోవాలని, పెంపుడు జంతువులపై జాలి చూపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోలూ మాదిరిగానే ప్రజలు పెంపుడు జంతువులకు విలువ ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. జంతువులపై అతడు చూపించిన ప్రేమను చాలామంది మెచ్చుకుంటున్నారు.