మాజీ ప్రభుత్వ ఉద్యోగి బ్రహ్మదేవ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గతేడాది జనవరి నుంచి దేశంలో వ్యాక్సిన్ పంపిణీ మొదలు కాగానే తొలి టీకా వేసుకున్నాడు. రెండో టీకా వేసుకున్న తర్వాత అతని ఆరోగ్యం తేలికపడిందట. ఇదేదో బాగుందే, ఇతర మందులూ కొనాల్సిన పనిలేదే అనుకుని నెలా, నెలన్నర గ్యాప్ ఇస్తూ ఇప్పటి దాకా 11 సార్లు కొవిడ్ టీకాలు వేయించుకున్నాడు.
బ్రహ్మరాక్షసిలా మానవాళిని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. మన దేశంలోనైతే రోజువారీ కేసులు మళ్లీ లక్షన్నర దాటేశాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్, వ్యాక్సిన్లు, తాజా ఒమిక్రాన్ గురించి నిపుణలు చెప్పే విషయాల పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రస్తుతానికైతే నివారణ తప్ప కొవిడ్ వ్యాధిని నిర్మూలించలేని స్థితిలో వ్యాక్సిన్లు మాత్రమే పరమ ఔషధంగా ఉన్నాయిప్పుడు. భారత్ లో కొవిన్ పోర్టల్ ద్వారా క్రమ పద్దతిలో ప్రజలందరికీ వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఒమిక్రాన్ నేపథ్యంలో మూడో(బూస్టర్) డోసు పంపిణీ కూడా జరుగుతోంది. కాగా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో అక్కడక్కడా అక్రమాలు చోటుచేసుకోవడం, ఇప్పటికీ కొన్ని చోట్ల వ్యాక్సిన్ డేటాపై అనుమానాలు వ్యక్తమవుతుండటం తెలిసిందే. అయితే, వ్యాక్సినేషన్ చరిత్రనే షేక్ చేసే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తి ఏకంగా 11 సార్లు కొవిడ్ టీకాలు తీసుకున్నట్లు తేలడంతో కలకలం రేగింది. ఆయన చర్య ముమ్మాటికీ నేరమేనని పోలీసులు కేసు బుక్ చేయగా, తన వాదన మాత్రం మరోలా ఉంది..
మనలో చాలా మంది ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండొచ్చు. వృద్ధులకు ఈ మధ్యే బూస్టర్ డోసును సైతం అందిస్తున్నారు. అయితే, బీహార్ కు చెందిన బ్రహ్మదేవ్ మండల్ అనే వ్యక్తి మాత్రం గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 11 సార్లు కరోనా టీకాలు తీసుకున్నాడు. 12వ సారీ టీకా పొందేందుకు ప్రయత్నిస్తూ ఆరోగ్య శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి మాధేపూర్ జిల్లా పురైనీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినయ్ కృష్ణ ప్రసాద్, పురైనీ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైరైన బ్రహ్మదేవ్ మండల్ అనే 84 ఏళ్ల వృద్దుడు నిబంధనలకు విరుద్ధంగా 11 సార్లు కొవిడ్ టీకాను పొందాడు. మెడికల్ ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు బ్రహ్మదేవ్ పై ఐపీసీ సెక్షన్ 188 (ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల అవిధేయత), సెక్షన్ 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (మోసం) కింద కేసు నమోదు చేశారు. ఇవన్నీ నాన్-బెయిలబుల్ సెక్షన్లే కావడంతో బ్రహ్మదేవ్ అరెస్టుకు రంగం సిద్దమైంది. అయితే వృద్దాప్యం కారణంగా అతనికి బెయిల్ లభించే అవకాశాలున్నాయి. అయినా, ఆయన ఇన్నేసి వ్యాక్సిన్తు ఎందుకు, ఎలా తీసుకున్నాడంటే..
ఇరవై ఏళ్ల కిందటే రిటైరైన బ్రహ్మదేవ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గతేడాది జనవరి నుంచి దేశంలో వ్యాక్సిన్ పంపిణీ మొదలు కాగానే తొలి టీకా వేసుకున్నాడు. రెండో టీకా వేసుకున్న తర్వాత అతని ఆరోగ్యం తేలికపడిందట. ఇదేదో బాగుందే, ఇతర మందులూ కొనాల్సిన పనిలేదే అనుకుని నెలా, నెలన్నర గ్యాప్ ఇస్తూ ఇప్పటి దాకా 11 సార్లు కొవిడ్ టీకాలు వేయించుకున్నాడు. 12వసారీ టీకా కోసం ప్రయత్నిస్తుండగా, మెడికల్ ఆఫీసర్లకు అనుమానం వచ్చి చెక్ చేయగా, తన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ పైనే బ్రహ్మదేవ్ ఇన్ని సార్లు టీకాలు పొందాడు. ఇంత జరుగుతున్నా అధికారులు గుర్తించకపోవడం ఏమిటనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నిపుణుల సూచనల ప్రకారం ఇప్పటికైనా ఒక మనిషికి గరిష్టంగా మూడు(బూస్టర్) డోసులకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా నిర్ణీత కాల పరిమితిలోనే.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.