Girl With 1 Leg Walks A km To School : సంకల్పమే కారుచీకట్లను బద్దలు కొడుతుంది.పేదల జీవితాలకు చదువు మాత్రమే వెలుగుదారులు పరుస్తుంది. బీహార్(Bihar)కి చెందిన సీమ అనే 10 ఏళ్ల బాలికకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. తన మొక్కవోని సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది. తన కల నెరవేర్చుకోవడానికి అంగ వైకల్యాన్ని ఎదిరిస్తోన్న 10 ఏళ్ల సీమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె దీనగాథ విన్న అధికారులు, వితరణశీలులు.. సాయం కోసం ముందుకొస్తున్నారు. తాజాగా సోనూసూద్ సైతం ఆమెకు సాయం చేస్తానంటూ ట్వీట్ చేశారు.
బీహార్‌లోని జముయీ జిల్లా ఖైరా బ్లాక్‌లోని ఫతేపుర్ గ్రామంలో ఉండే సీమాకు చదువంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక టీచర్ అవాలని,పేద పిల్లలకు చదువు చెప్పాలని కలలు కంటుండేది. సీమా తల్లిదండ్రులు ఇటుకల తయారీ పనికి వెళ్తారు. రెండేళ్ల క్రితం తన తండ్రికి ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో సీమా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో రెండు కాళ్లలో ఒక కాలును కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ సీమ కుంగిపోలేదు. దివ్యాంగురాలిననే భావన దరిచేరకుండా సొంతంగా తన పనులు చేసుకోవడం ప్రారంభించింది. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేది. ఎవరికీ భారం కాకూడదని ఒంటికాలితో గెంతుకుంటూనే స్కూల్‌కు వెళ్తోంది. ఒంటికాలితోనే నిత్యం 1 కి.మీ దూరం గెంతుకుంటూ స్కూల్‌కు వెళ్తోంది. ఆమెకు విద్యనేర్పే టీచర్లు సైతం సీమా పట్టుదలను చూసి మెచ్చుకుంటున్నారు. వికలాంగురాలు అయినప్పటికీ సీమాలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని,ఇతర పిల్లలకు ఆమె ఎందులోనూ తీసిపోదని శివ కుమార్ భగత్ అనే స్థానిక టీచర్ తెలిపారు.
ALSO READ Woman Find Diamond : అదృష్టమంటే నీదేనమ్మా..మహిళకు దొరికిన వజ్రం..రాత్రికి రాత్రే లక్షాధికారి
ఇటీవల సీమా స్కూల్‌కు వెళ్తున్న వీడియోను ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. సీమ వీడియో చూసిన నెటిజన్లు ఆమె సంకల్పానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. సీమా గురించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వైద్య శాఖ స్పందించింది. అధికారులు వచ్చి సీమా కాలిని పరిశీలించారు. ఆమెకు కృత్రిమ కాళ్లను అమర్చాలని నిర్ణయించారు. మరోవైపు,సీమ గురించి తెలిసి స్థానిక అధికారులు ఆమెకు మూడు చక్రాల సైకిల్ ఇచ్చారు. త్వరలోనే ఆమెకు కృత్రిమ కాలు కూడా పెట్టిస్తామని, పక్కా ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ క్రమంలోనే తాజాగా సోనూసూద్ సైతం సీమా కోసం సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇకపై సీమా రెండు కాళ్లతో నడుస్తుందని అన్నారు. సీమా కోసం టికెట్లు పంపిస్తున్నానని ట్వీట్ చేశారు.
अब यह अपने एक नहीं दोनो पैरों पर क़ूद कर स्कूल जाएगी।
— sonu sood (@SonuSood) May 25, 2022
टिकट भेज रहा हूँ, चलिए दोनो पैरों पर चलने का समय आ गया। @SoodFoundation 🇮🇳 https://t.co/0d56m9jMuA
సీమా చదువుకోవాలని అనుకుంటోంది. మేం కూడా ఆమె మంచిగా చదువుకోవాలనే అనుకుంటున్నాం. మాకు ఎవరి నుంచి ఎలాంటి సాయం అందలేదు. ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుతున్నాం అని సీమా నాయనమ్మ లక్ష్మీదేవి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Minor girl, Sonusood, Viral Video