బిగ్‌బాస్: నాని ఆ సెంటిమెంట్‌కు భయపడ్డాడా!

‘జంబలకిడి పంబ’ నుంచి ‘నన్ను దోచుకుందువటే’ దాకా ‘బిగ్‌బాస్’ హౌస్‌ లోపలికి వెళ్లిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్... బయటి నుంచి ప్రమోషన్ చేసిన వారికి సూపర్ హిట్స్!

news18-telugu
Updated: September 28, 2018, 10:37 AM IST
బిగ్‌బాస్: నాని ఆ సెంటిమెంట్‌కు భయపడ్డాడా!
బిగ్‌బాస్ హోస్ట్ నాని, ఫైనలిస్ట్‌లు
  • Share this:
తెలుగులో విశేషాదరణ కార్యక్రమాల్లో ‘బిగ్‌బాస్’ ఒకటి. ఈ కార్యక్రమం పుణ్యమాని మళ్లీ ‘స్టార్ మా’ ఛానెల్ తెలుగు ఎంటర్‌‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో టాప్ ప్లేస్ ఆక్రమించింది. సీజన్ 2కి మొదట్లో పెద్దగా టీఆర్పీ రేటింగ్స్ రాకపోయినప్పటికీ... కౌశల్ ఆర్మీ పుణ్యమాని ఇప్పుడు అది కూడా పెద్ద హిట్టయ్యికూర్చుంది. అయితే సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 ‘బిగ్‌బాస్’ హౌస్ సినిమా ప్రమోషన్లకి పెద్దగా కలిసి రావడం లేదు. మొదటి వారం దగ్గర్నుంచి చివరి వారందాకా ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి అడుగుపెట్టి, ప్రమోషన్ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం చెందడం విశేషం.

రెండో వారంలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ కలిసి ‘జంబలకిడి పంబ’ చిత్ర ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఆ తర్వాత నాలుగో వారం సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి ‘బిగ్‌బాస్’ హౌస్‌లో సందడి చేశారు. ‘తేజ్ ఐలవ్ యూ’ ప్రమోషన్ భారీగా చేశారు. ఆ సినిమా తేజ్‌కి వరుసగా ఆరో డిజాస్టర్ సినిమాగా నిలిచింది. హిట్లతో దూసుకుపోతున్న అనుపమకి పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఆరో వారం మంచు లక్ష్మీ ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది. ఆ సినిమా అలా వచ్చి, ఇలా వెళ్లింది.

ఎన్.టీ.ఆర్ హోస్ట్ చేసిన ‘బిగ్‌బాస్’ హౌస్‌లో ప్రమోషన్ నిర్వహించిన సినిమాల్లో 80 శాతం సూపర్‌హిట్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.


ఎనిమిదో వారంలో తమిళ ‘బిగ్‌బాస్’ హోస్ట్, విశ్వనాయకుడు కమల్ హాసన్, పూజా గాంధీ, గిబ్రాన్‌తో కలిసి  తెలుగు ‘బిగ్‌బాస్’ హౌస్‌లో సందడి చేశాడు. లోకనాయకుడికి కూడా ‘బిగ్‌బాస్’ కలిసిరాలేదు. ‘విశ్వరూపం 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత పదకొండో వారం ‘నీవెవరో’ సినిమా ప్రమోషన్ కోసం ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ‘బిగ్‌బాస్’లో సందడి చేశారు. సేమ్ రిజల్ట్. పదమూడో వారంలో ‘మను’ సినిమా కోసం గౌతమ్, చాందిని... ‘సిల్లీ ఫెలోస్’ మూవీ కోసం సునీల్, అల్లరి నరేశ్ ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి వెళ్లారు. ఈ రెండు సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాలేదు. ఇక చివరి వారం సుధీర్‌బాబు, నబా నటేశ్ కలిసి ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ప్రమోషన్ కోసం ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి వెళ్లారు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.

హౌస్‌లోపలికి వెళ్లకుండా బయటి దాకా వచ్చి ప్రమోషన్ చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. సుశాంత్ అండ్ టీమ్, అడివి శేషు అండ్ టీమ్ కలిసి ‘గూఢచారి’, ‘చి.ల.సౌ’ సినిమాలను హౌస్‌ బయటి నుంచి ప్రమోషన్ చేశారు. ‘గీత గోవిందం’ సినిమా కోసం విజయ్ దేవరకొండ కూడా హౌస్ బయటి నుంచే ప్రమోషన్ నిర్వహించారు. ఈ సినిమాలన్నీ మంచి కలెక్షన్స్ సాధించడం విశేషం. నాని కూడా ఈ సెంటిమెంట్ కారణంగానే తన ‘దేవదాస్’ ప్రమోషన్ హౌస్ లోపలికి వెళ్లకుండా బయటి నుంచే కానిచ్చేశాడని టాక్.
First published: September 28, 2018, 10:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading