బిగ్ బాస్ హౌస్‌లోకి పోలీసులు...సినీ నటి వనిత విజయ్‌కుమార్ అరెస్టు?

Bigg Boss 3 Tamil | బిగ్ బాస్‌లో కంటెస్టంట్‌గా ఉన్న వనిత విజయకుమార్‌ను ఓ కేసుకు సంబంధించి విచారించనున్న హైదరాబాద్ పోలీసులు, అవరసరమైతే ఆమెను అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది.

news18-telugu
Updated: July 3, 2019, 11:17 AM IST
బిగ్ బాస్ హౌస్‌లోకి పోలీసులు...సినీ నటి వనిత విజయ్‌కుమార్ అరెస్టు?
వనిత విజయకుమార్
  • Share this:
చెన్నై శివారు లోని బిగ్ బాస్ హౌస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటోంది. బిగ్ బాస్-3 తమిళ్‌లో పాల్గొంటున్న సినీ నటి వనిత విజయకుమార్‌ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో నమోదైన ఓ  కేసుకు సంబంధించి ఆమెను విచారించేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తమిళ్‌లో బిగ్ బాస్ మూడో సీజన్ పది రోజుల క్రితం ప్రారంభమయ్యింది. ఇందులో వనిత విజయకుమార్ కూడా కంటెస్టెంట్‌గా ఉన్నారు.

తమిళ సీనియర్ నటుడు విజయ కుమార్ కుమార్తె వనిత తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించింది. 2000 సంవత్సరం ఆకాష్‌ అనే బుల్లితెర నటుడిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి విజయ్ శ్రీహరి, జోవికా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఆకాష్‌తో విభేదాలు ఏర్పడడంతో ఆయన నుంచి విడాకులు తీసుకుంది. 2007లో ఆనందరాజ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. వారికి జయంతిక అనే కుమార్తె ఉంది. ఆనందరాజ్, వనిత మధ్య బేధాభిప్రాయాలు నెలకొనడంతో పరస్పర ఆమోదంతో వారిద్దరూ 2012లో విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తె జయంతిక తండ్రి ఆనందరాజ్‌తో గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌‌లో ఉంటూవచ్చింది.

ఫిబ్రవరి మాసంలో జయంతికను చూసేందుకు హైదరాబాద్ వచ్చిన వనిత, జయంతికను తన వెంట చెన్నై తీసుకెళ్లింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జయంతికను వనిత అపహరించి  తన వెంట తీసుకెళ్లినట్లు ఆనందరాజ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె పోషణను పట్టించుకోకుండా వనిత బిగ్ బాస్‌ హౌస్‌లో పాల్గొనేందుకు వెళ్లిందని, వనితపై చర్యలు తీసుకోవడంతో పాటు తన కుమార్తెను తిరిగి తనకు అప్పగించాలని ఆనందరాజ్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వనిత వద్ద విచారించేందుకు హైదరాబాద్ పోలీసులు, స్థానిక పోలీసులు చెన్నై శివారులోని పూందమల్లి సమీపంలోని నజరత్ పేట్‌లో ఉన్న పీవీఆర్ ఫిలింసిటీలోని బిగ్ బాస్ హౌస్ వద్దకు చేరుకున్నారు. వనితను విచారించనున్న పోలీసులు, విచారణ తర్వాత ఆమెను బిగ్ బాస్ హౌస్‌లోనే అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది.
Published by: Janardhan V
First published: July 3, 2019, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading