Tiger Attack : ఊళ్లోకి వచ్చిన పెద్ద పులి... ఆవుపై దాడి... తరిమిన స్థానికులు

Tiger Attack : ఊళ్లోకి వచ్చిన పెద్ద పులి... ఆవుపై దాడి... తరిమిన స్థానికులు

చక్కగా వర్షాలు పడ్డాయి. పంటలు చేతికొస్తాయి అని ఆ ఊరి ప్రజలు ఆశల్లో ఉంటే... ఎక్కడి నుంచి వచ్చిందో గానీ పెద్దపులి నానా హంగామా చేసింది. వాళ్లు ఎంతో ధైర్యం ప్రదర్శించి దాన్ని తరిమేశారు.

 • Share this:
  ఇప్పుడు మనం ఓ కథను తెలుసుకుందాం. అందులో ఆ ఊరి జనం ఓ పెద్ద పులితో సై అంటే సై అన్నారు. ప్రాణాలకు తెగించారు. కానీ ఆ పెద్ద పులిని ఏమాత్రం గాయపరచకుండా... ఊరి నుంచి పంపించారు. అంటే వాళ్లు పులిని కాపాడినట్లే. అసలేమైందంటే... ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా లాతి గ్రామంలో కొన్ని రోజులుగా పెద్ద పులి తిరుగుతోంది. అక్కడ వానలు బాగా పడటంతో... పొలాలే అడవుల్లా పెరిగాయి. దాంతో పెద్ద పులి... అది కూడా అడవే అనుకుంటూ ఇష్టమొచ్చినట్లు తిరుగుతోంది. ఈ విషయం ఆల్రెడీ తెలుసుకున్న స్థానికులు... జాగ్రత్తగా ఉందాం అని తమ భాషలో అనుకున్నారు. పులి అలా అలా తిరుగుతున్నా... ఏ రోజూ వాళ్లకు అది ఎదురుపడలేదు. కానీ... దూరంగా అప్పుడప్పుడు పులి గాండ్రింపులు వింటూ... ఏ రోజు కా రోజు... కరోనా కంటే భయంగా జీవించసాగారు.

  పెద్ద పులి వచ్చిన సందర్భం


  ఇలాంటి పరిస్థితిలో... ఓ పొలంలో ఆవు చనిపోయి కనిపించింది. అది చూసిన రైతులు... వామ్మో... ఆవుని చంపేసింది. చంపేసింది... పులి పులి అని అరవడం మొదలుపెట్టారు. అది విన్న ప్రజలంతా అలర్ట్ అయ్యారు. అందరి నోటా అదే మాట... పులి వచ్చింది, తరిమేద్దాం.... చూడండి... ఈ చుట్టు పక్కలే ఎక్కడో నక్కి ఉంటుంది... అని కర్రలు పట్టుకొని... రకరకాలుగా అరుస్తూ చుట్టూ వెతికారు. వాళ్లు ఎంతలా అరుస్తున్నా... ఆ పులి మాత్రం అస్సలు భయపడట్లేదు. నాకేంటి అన్నట్లుగా అది ఓ కాలువలో అలా అలా నడుస్తూ... పైకి వెళ్లింది. అది చూసిన ప్రజలు... వామ్మో... అదుగో, అదుగో... పైకొస్తుంది. మీరు అటు తరమండి... మేం ఇటు తరుముతాం అనుకున్నారు.

  ఆవును చంపిన పెద్దపులి


  ఈ పోరాటంలో మనం ఎవ్వరం గాయపడకూడదు. పులికి దొరకకూడదు. అదే సమయంలో పులి కూడా అడవులలోకి పోవాలి. ఓకేనా అని అనుకుంటూ పెద్ద ఆపరేషనే చేశారు. అలా చేస్తూ... వీడియోలు, ఫొటోలు కూడా తీశారు. వాళ్లు ఎంతకీ వెనక్కి తగ్గకపోయే సరికి... పులికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఓ నీటి కొలనులో దాక్కోవాలని ట్రై చేసింది. అది చూసిన పిల్లలు, పెద్దలు... అదిగో పులి అదుగో తోక అంటూ దాని వైపు పరుగులు పెట్టారు. అంతే... ఆ పులికి టెన్షన్ మొదలైంది. ఇక తనను వదలరని డిసైడైంది. అడవుల్లో ఏదో ఒకటి తిని బతుకుదాం... ఈ ప్రజల్లోకి మాత్రం రాకూడదు... చంపేస్తారు అనుకుంటూ ఆ పులి అడవుల్లోకి పారిపోయింది.

  పులిని తరుముతున్న స్థానికులు


  పులిని తరుముతున్న స్థానికులు


  పులిని తరుముతున్న స్థానికులు


  ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే ఈ ఘటన తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రానికి దగ్గర్లోనే జరిగింది. సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో వన్య ప్రాణుల తిరగక ఏం చేస్తాయని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాంటి చోట... ప్రజలే దూరంగా ఉండేలా చెయ్యాలని అధికారులపై మండిపడుతున్నారు.

  స్థానికులేమో... తమ పొలాల్లో తాము పనిచేసుకుంటుంటే... పులే తమ దగ్గరకు వచ్చిందనీ, తమ తప్పు ఏమీ లేదని అంటున్నారు. దీనిపై స్పందించిన అధికారులు... ఇప్పుడా పులి కోసం గాలిస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: