Home /News /trending /

Viral News: న్యూస్ యాంకర్‌కు వేసవి సెగ.. షార్ట్స్ వేసుకొని స్టూడియోలో వార్తలు చదివిన వైనం

Viral News: న్యూస్ యాంకర్‌కు వేసవి సెగ.. షార్ట్స్ వేసుకొని స్టూడియోలో వార్తలు చదివిన వైనం

(Image Credit-Twitter)

(Image Credit-Twitter)

ఓ న్యూస్ యాంకర్ స్టూడియోలో షార్ట్స్ ధరించి వార్తలు చదివాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి.

మన దేశంలో ఇప్పుడిప్పుడే వేసవి ప్రతాపం తగ్గుముఖం పడుతోంది. తొలకరి జల్లులతో వేడి వాతావారణం కాస్త చల్లబడింది. దీంతో ప్రజలు కొత్త వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే బ్రిటన్‌లో మాత్రం అసలు వేసవి ఇప్పుడే మొదలైంది. అతి వేడి ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో సూట్లు, కోట్లతో పెద్ద ప్రొఫెషనల్స్‌ మాదిరిగా ఉండే బ్రిటన్ వాసులు, బరువైన బిగుతు దుస్తులతో కార్యాలయాలకు వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో షార్ట్స్‌ పైనే ఆఫీసుకు వచ్చాడు బీబీసీ వార్తా సంస్థకు చెందిన ఒక న్యూస్ యాంకర్. అంతేకాదు.. స్టూడియోలో షార్ట్స్ ధరించి వార్తలు చదివాడు. దీంతో ఇప్పుడు బీబీసీ వ్యాఖ్యాత, 51 ఏళ్ల షాన్ లేపై జోకులు వేస్తూ, కామెంట్లతో సందడి చేస్తున్నారు నెటిజన్లు.

సాధారణంగా అన్ని వార్తా సంస్థల్లోనూ యాంకర్లు సూట్ ధరించి వార్తలు చదువుతారు. విశ్లేషణలు, చర్యల్లో పాల్గొనేవారు మరింత పద్ధతిగా కనిపిస్తారు. కానీ షాన్‌ లే మాత్రం వేసవి తాపానికి తట్టుకోలేక షార్ట్స్‌ పైనే వార్తలు చదివారు. నిజానికి షాన్‌ సూట్ ధరించి వార్తలు చదువుతారు. కానీ గత బుధవారం బ్రిటన్‌లో అత్యధిక వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆ వేడికి తట్టుకోలేక కొత్త ప్లాన్ వేశారు. సూట్‌ వేసుకున్నా, వార్తలు చదివేటప్పుడు నడుం నుంచి పైభాగం మాత్రమే టీవీల్లో కనిపిస్తుంది. అందువల్ల ప్యాంట్ కాకుండా షార్ట్ వేసుకుంటే వేడి ప్రభావం తగ్గి, కాస్తయినా ఉపశమనం లభిస్తుంది అనుకున్నారు. అదే ప్రణాళిక ప్రకారం వార్తలు చదివారు. కానీ వార్తలు ముగిశాక.. కెమెరా మెన్ ఒక వైడ్ యాంగిల్ షాట్‌ తీసినప్పుడు డెస్క్ మొత్తం కనిపించింది. దీంతో అతడు షార్ట్స్‌ ధరించి వార్తలు చదివాడనే విషయం అందరికీ తెలిసింది.

ఒక బీబీసీ యాంకర్.. పైన కోటు, కింద షార్ట్స్, బూట్లు ధరించి వార్తలు చదివిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షాన్‌ లే షార్ట్స్‌తో డెస్క్‌లో కూర్చొని ఉన్న ఫోటోలను నెటిజన్లు వైరల్ చేశారు. అయితే చాలామంది ట్విట్టర్ యూజర్లు షాన్‌ లేకు మద్దతుగా నిలిచారు. బ్రిటన్‌లో ఆరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో, అతడు చేసిన పనిలో తప్పేం లేదని చెబుతున్నారు.

‘హాటెస్ట్ డే రోజున ఇలాంటి సూట్‌ను స్టైలిష్‌గా ధరించవచ్చు’ అని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. వేసవిలో, స్టూడియో లైట్లతో మరింత ఇబ్బంది పడకుండా షాన్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడని మరో వ్యక్తి కామెంట్ రాశాడు. వర్చువల్ జూమ్ కాల్ కోసం చాలామంది ఇలాగే సిద్ధమవుతారని ఇంకొక వ్యక్తి పేర్కొన్నాడు. ‘డెస్క్ పైన ఫార్మల్.. డెస్క్ కింద నార్మల్’ అని ఒక వ్యక్తి ఫన్నీ కామెంట్ పెట్టాడు. కరోనా ప్రభావం తరువాత వర్చువల్ మీటింగులు ఎక్కువైన నేపథ్యంలో, ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్‌ అందరికీ నప్పుతుందని కామెంట్లు వస్తున్నాయి. షాన్‌ లేకు ముందు, షార్ట్స్ ధరించి న్యూస్ యాంకర్లు వార్తలు చదివిన సంఘటనలు ఇంతకు ముందు కూడా వెలుగు చూశాయి. గత సంవత్సరం ఒక ABC న్యూస్ రిపోర్టర్ కూడా ప్యాంటు లేకుండా డెస్క్‌లో కూర్చొని వార్తలు చదివాడు. అయితే ఆ తరువాత కెమెరాలో ఈ విషయం బయటపడి, వైరల్‌గా మారింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: News, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు