పబ్జీ.. ఈ గేమ్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. రాత్రిబంవళ్లు పబ్జీ ఆడేవారు చాలా మందే ఉన్నారు.ఐతే ఈ గేమ్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఐతే పబ్జీ గేమ్.. కొత్త పేరు, కొత్త రూపుతో తిరిగి మన దేశంలోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) పేరుతో ఈ వార్ గేమ్‌ను మన దేశంలో లాంచ్ చేస్తున్నారు. మంగళవారం నుంచి ప్రీ రిజిస్ట్రేషన్ కూడా మొదలైంది. అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి.. యాప్ అందుబాటులోకి రాగానే డౌన్లోడ్ అయిపోతుంది. బీజీఎంఐని వచ్చే నెల రెండో వారంలో విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ప్లే స్టోర్‌లో రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు. ఐఓఎస్ రిజిస్ట్రేషన్లు త్వరలో మొదలవుతాయి. పబ్జీని మించేలా కొత్త బీజీఎంఐ ఉంటుందని కొత్త సంస్థ క్రాఫ్టన్ చెబుతోంది. అయితే ఈసారి వయలెన్స్ తక్కువగా, ప్రైవసీ ఎక్కువగా ఉండనుందని సమాచారం.
రిజిస్ట్రేషన్ కోసం ప్లే స్టోర్‌లోకి వెళ్లి Battlegrounds Mobile India అని టైప్ చేస్తే చాలా గేమ్స్ కనిపిస్తున్నాయి. అయితే వాటిలో Krafton అనే సంస్థ తయారు చేసిన గేమ్‌ను మాత్రమే ప్రి రిజిస్టర్ చేయాలి. ప్రి రిజిస్టర్ కొట్టాక... ‘ఈ గేమ్ అందుబాటులోకి రాగానే డౌన్లోడ్ చేయాలా?’ అని అడుగుతుంది. దానికి మీరు ఓకే చెబితే... గేమ్‌ను సంస్థ రిలీజ్ చేయగానే మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఆటో డౌన్లోడ్ క్లిక్ చేయకపోతే గేమ్ అందుబాటులోకి రాగానే... మీకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి బీజీఎంఐ నాలుగు రకాల రివార్డ్స్ ఇస్తుంది. అందులో రెకాన్ మాస్క్, రెకాన్ ఔట్ ఫిట్, సెలబ్రేషన్ ఎక్స్పర్ట్ టైటిల్, 300 ఏజీ ఉంటాయి. అంటే ఇవి గేమ్‌లో ఆడే మీ అవతార్‌కి లభిస్తాయి. మీకు ఫిజికల్ గిఫ్ట్స్‌గా కాదు. కొత్త గేమ్‌తో కూడా టోర్నమెంట్స్, లీగ్స్ లాంటివి నిర్వహిస్తామని కొత్త సంస్థ క్రాఫ్టన్ చెబుతోంది. అయితే చాలా విషయాల్లో పబ్జీకి దగ్గరగానే ఉంటుందట. అయితే మన దేశానికి, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని మార్పులు అయితే ఉంటాయి.
పిల్లలు పబ్జీలో మునిగిపోయి మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని గతంలో వార్తలొచ్చాయి. దీంతో బీజీఎంఐ ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటోంది. 18 ఏళ్ల కంటే చిన్నవాళ్లు ఈ గేమ్ ఆడే విషయంలో కొన్ని నిబంధనలు విధించారు. పిల్లలు గేమ్ ఆడాలనుకుంటే... వాళ్ల తల్లిదండ్రులు, గార్డియన్ నెంబరును ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు రోజుకు గరిష్ఠంగా మూడు గంటలు మాత్రమే గేమ్ ఆడేలా మార్పులు చేశారట.
ఇక పబ్జీని గుర్తు చేసుకుంటే... సమాచార సాంకేతికత చట్టంలోని 69ఏ సెక్షన్ కింద గతేడాది సెప్టెంబర్ 2న పబ్జీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వినియోగదారుల సమాచార భద్రతకు సంబంధించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో పబ్జీ టెన్సెంట్తో భాగస్వామ్యం రద్దు చేసుకొని, క్రాఫ్టన్‌తో కలసి ఇప్పుడు మళ్లీ దేశంలోకి అడుగుపెడుతోంది. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BGMI, PUBG, PUBG Mobile India, Video Games