సాధారణంగా ఐస్‌క్రీమ్ (Ice Cream) ఫ్రీజర్ లేదా ఫ్రిజ్‌లో కాకుండా బయట ఉంచితే నిమిషాల వ్యవధిలోనే కరిగిపోతుంది. అయితే ఒక చైనీస్ బ్రాండ్ (Chinese Brand) తయారు చేస్తున్న కొన్ని ఐస్‌క్రీమ్ ప్రొడక్ట్స్ మాత్రం రూమ్ టెంపరేచర్‌లో గంటల తరబడి ఉంచినా కరగడం లేదు. ఈ ఐస్‌క్రీమ్స్‌ను వెల్డింగ్ చేయడానికి ఉపయోగించే బ్లోటార్చ్ (Blow Torch)తో కాల్చినా కరిగి పోవడం లేదు. ఇలా ఎంత మంట తగిలినా ఆ ఐస్ క్రీమ్స్ ద్రవపదార్థాలుగా మారక పోవడంతో కస్టమర్లు(Customers) షాక్ అవుతున్నారు. ఘనపదార్థాలుగానే ఉన్న ఈ ఐస్‌క్రీమ్స్‌కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అసలిది ఐస్ క్రీమేనా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ మరింత చిక్కగా, గట్టిగా ఉండేందుకు కంపెనీ ఆర్టిఫిషియల్ థిక్నర్స్ (Artificial Thickeners) ఉపయోగించి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ప్రొడక్ట్స్‌తో ప్రజలను చంపేస్తారా అని ఇంకొందరు కంపెనీని ఏకిపారేస్తున్నారు.
వివరాలలోకి వెళితే.. చైనీస్ ఐస్‌క్రీమ్ బ్రాండ్ చీజ్‌క్రీమ్ (Chicecream) రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీ జాంగ్ జు గావో (Zhong Xue Gao) అనే 10 డాలర్ల (దాదాపు రూ.792) ఖరీదైన ఐస్‌క్రీమ్స్ కూడా విక్రయిస్తుంది. సాధారణ ఐస్‌క్రీమ్ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే వీటి ధర చాలా ఎక్కువే. అయితే వీటి ఖరీదు మాత్రమే కాదు వీటి క్వాలిటీ కూడా కస్టమర్లను తెగ భయపెట్టిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఐస్‌క్రీమ్‌లు 31 డిగ్రీల సెల్సియస్ (88 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత ఉన్న గదిలో గంటపాటు ఉంచినా కరిగి పోలేదు. చాలా వేడి మంటలో ఉంచినప్పుడు సైతం అవి పూర్తిగా కరగలేదు. అలానే సాల్ట్ కోకోనట్ ఐస్‌క్రీమ్‌ను మంటల్లో కాల్చినా కరగలేదని ఒక నెటిజన్ వీడియో ప్రూఫ్‌తో సహా వెల్లడించారు.
ఈ దృశ్యాలను చూపించే వీడియోలు వైరల్‌గా మారాయి. దాంతో కంపెనీపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఐస్‌క్రీమ్ తయారీలో ఫుడ్ అడిటివ్స్ (Food Additives)తో పాటు ఆర్టిఫిషియల్ థిక్నర్స్ అతిగా వాడటం వల్ల ఇవి కరిగిపోవడం లేదో అని కస్టమర్లు తమ అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. ఇలా అతిగా అడిటివ్స్ వాడిన ప్రొడక్ట్స్ సురక్షితమేనా అని చాలామంది కంపెనీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఒక వివరణ ఇచ్చుకుంది.
మా ఐస్‌క్రీమ్ ప్రొడక్ట్స్ చాలా సేఫ్: చీజ్‌క్రీమ్ కంపెనీ
ఈ వింత ఐస్‌క్రీమ్ ప్రొడక్ట్స్ తయారుచేసే చీజ్‌క్రీమ్ కంపెనీ కస్టమర్ల కోసం వీబోలో ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సాల్ట్ కోకోనట్ ఐస్‌క్రీమ్ పూర్తిగా సురక్షితమైనదని, ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తయారవుతుందని తెలిపింది. కంపెనీ ప్రకారం, ఈ ఐస్‌క్రీమ్‌లో పాలు 35.8 శాతం, లైట్ క్రీమ్ 19.2 శాతం, కొబ్బరి పాలు 11.2 శాతం, తియ్యటి కండెన్స్‌డ్ మిల్క్ 7.4 శాతం, పాల పొడి 6 శాతం ఉన్నాయి. అయితే ఇందులో 40 శాతం కంటే ఎక్కువ ఘన పదార్థం ఉంది. ఈ శాతం జాతీయ ప్రమాణం కంటే 20 శాతం ఎక్కువ.
"మా ఐస్‌క్రీమ్ ప్రొడక్ట్స్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద 3-4 నిమిషాలలో కరుగుతాయి. కాలిపోయినప్పుడు కూడా కరగని వీడియోలు చూడటం ఇదే మొదటిసారి. ఐస్‌క్రీమ్‌ను కాల్చడం, ఎండబెట్టడం లేదా వేడి చేయడం ద్వారా ఐస్‌క్రీమ్ నాణ్యతను నిర్ధారించడం శాస్త్రీయం కాదని మేం విశ్వసిస్తున్నాం" అని కంపెనీ పేర్కొంది. ఆహార ఉత్పత్తులలో స్టెబిలైజర్లు లేదా ఫుడ్ అడిటివ్స్ విరివిగా వాడుతుంటారు. వీటికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం లభించింది. వీటిని ఐస్ క్రీమ్‌లలో తరచుగా వాడతారు. సీనియర్ నేషనల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వాంగ్ సిలు కూడా ఐస్‌క్రీమ్ చిక్కగా చేయడానికి ఉపయోగించే అడిటివ్స్ సురక్షితమేనని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Food Items, Ice cream, Junk food