Gold Loan: ఆన్‌లైన్‌లో గోల్డ్ లోన్... ఇలా తీసుకోవచ్చు

Gold Loan: ఆన్‌లైన్‌లో గోల్డ్ లోన్... ఇలా తీసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Gold Loan | మీరు బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? గోల్డ్ లోన్‌కు ఎలా అప్లై చేయాలో, ఎన్ని రకాలుగా గోల్డ్ లోన్ స్కీమ్స్ ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    కరోనా కష్టకాలంలో బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బ్యాంకులో సులువుగా రుణం రావాలంటే గోల్డ్ లోన్ తీసుకోవడమే మేలు. మీ దగ్గరున్న బంగారాన్ని తాకట్టుపెడితే ఓ గంటలో లోన్ తీసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బంగారం ఆదుకుంటుంది. ఇంట్లో బంగారం ఉంటే అందుకే ధీమాగా ఉంటారు. బ్యాంకులు కూడా బంగారాన్ని తాకట్టు పెట్టుకొని లోన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంటాయి. ఈ రోజుల్లో బ్యాంకులో రుణాలు తీసుకునే పద్ధతి పూర్తిగా మారిపోయింది. మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ముందు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్‌లైన్‌లోనే గోల్డ్ లోన్‌కు అప్లై చేయొచ్చు. ఇప్పటికే పలు బ్యాంకులు కొత్తగా గోల్డ్ లోన్ స్కీమ్స్ ప్రారంభించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్సనల్ లోన్ తీసుకోవడం కంటే గోల్డ్ లోన్ తీసుకోవడమే మేలు.

    మీరు ఏదైనా బ్యాంకు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఓపెన్ చేసి గోల్డ్ లోన్‌‌కు దరఖాస్తు చేయొచ్చు. మీ దగ్గర ఎంత బంగారం ఉంది, ఆ బంగారం క్వాలిటీ వివరాలు, మీకు ఎంత లోన్ కావాలి, తిరిగి ఎంత కాలంలో చెల్లిస్తారో ఆన్‌లైన్‌లో వెల్లడిస్తే మీకు ఎంత లోన్ వస్తుందో అక్కడే తెలుసుకోవచ్చు. మీ దగ్గరున్న బంగారానికి మార్కెట్ వ్యాల్యూను లెక్కించి అందులో 75% వరకు లోన్ ఇస్తాయి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు. ఉదాహరణకు మీ దగ్గర ఉన్న బంగారం మార్కెట్ వ్యాల్యూ రూ.1,00,000 అనుకుంటే రూ.75,000 వరకు లోన్ పొందొచ్చు. ఆన్‌లైన్‌లో మీకు ఎంత లోన్ వస్తుందో తెలుసుకున్నాక దరఖాస్తు చేయొచ్చు. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి మీ నగలు ఇచ్చి వెంటనే లోన్ తీసుకోవచ్చు. ఓ గంట లోపే లోన్ మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.

    సాధారణంగా గోల్డ్ లోన్స్ నాలుగు రకాలుగా ఉంటుంది. ముందస్తు వడ్డీ విధానంలో మీరు తీసుకున్న లోన్‌కు ముందే వడ్డీ చెల్లించొచ్చు. రెండో పద్ధతిలో బుల్లెట్ రీపేమెంట్ పద్ధతిలో అసలు, వడ్డీ చివర్లో చెల్లించొచ్చు. మూడో పద్ధతిలో మీరు తీసుకున్న రుణం+వడ్డీని ఈఎంఐలుగా మార్చి చెల్లించొచ్చు. నాలుగో పద్ధతిలో మీరు వాడుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించే సదుపాయం ఉంటుంది. ప్రాసెసింగ్, రీపేమెంట్, వాల్యూషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
    First published: