VisakhaPatnam: ఈ ఆటో డ్రైవర్ అందరి బంధువయ: సంపాదన అంతంత మాత్రమే అయినా ఆపద్బాంధవుడయ్యాడు

ఈ ఆటో డ్రైవర్ అందరి బంధువయ

రోజంతా కష్టపడి ఆటో నడిపినా ఐదువేళ్లు నోట్లకి వెళ్లడం కష్టం.. అలాంటి ఓ ఆటో డ్రైవర్ ప్రతి రోజూ 150 మందికి అన్నం పెడుతూ ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. ఆరోగ్యం బాగులేని రోగులకు సహాయంగా వచ్చి పస్తులు ఉంటున్నవారి కడుపు నింపుతూ మానవత్వం చాటుకుంటున్నాడు.

 • Share this:
  నాలుగు రాళ్లు సంపాదించినా సేవా గుణం కొద్దిమందిలోనే ఉంటుంది. తినడానికి సరిపడ ఉన్నా పక్కవాడి కష్టాలు పట్టించుకోని రోజులు ఇవి. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో అక్కడక్కడ మానవత్వం పరిమళించిన మనషులు దర్శనమిస్తున్నారు. అలాంటివారిలో విశాఖకు చెందిన ఓ అటో డ్రైవర్ ముందుంటున్నాడు. పగలనక  రాత్రనక కష్టపడితే  అతడికి వచ్చే సంపాదన అంతంత మాత్రమే అయినా.. మనసు ఉంటే మనకు ఉన్నదాంట్లో నుంచే సాయం చేయొచ్చన్న సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్మాడు. దాన్ని ఆచరిస్తూ.. ఇప్పుడు విశాఖపట్నంలోని ఎందరికో కడుపునింపుతున్నాడు. అతడు చేస్తున్నది మంచి పనికాబట్టి కొందరు దాతలు సహకరిస్తున్నారు.

  విశాఖపట్నంలోని మధురువాడ రాజీవ్ గృహకల్ప కాలనీ (Visakhapatnam madhurawada rajeev gruhakalpa colony)లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు గుజ్జల భూమయ్య(gujjala bhumayya). అతడికి మొదటి నుంచి సేవాభావం కాస్త ఎక్కువే. దీంతో వెంకోజీపాలెం జ్ఞానానంద స్వామిజీ చేసే సేవా కార్యక్రమంలో భాగం పంచుకున్నాడు. తన వంతుగా ప్రతి రోజూ 50 మందికి భోజన ప్యాకెట్లు అందించేవాడు. అయితే ఒకసారి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో అన్నదానం చేస్తున్న ఒక దాత.. విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో కూడా అన్నదానం చేసే ఉద్దేశంతో ఆశ్రమ స్వామిజీని సంప్రదించాడు. ఆయన అప్పుడు ఆటోడ్రైవరు భూమయ్యను కలవమని సలహా ఇచ్చారు. మొదట్లో ఆయన సాయంతో మానసిక ఆసుపత్రిలో రోగుల బంధువులకు భోజనం సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఆశ్రమంతో సంబంధం లేకుండా భూమయ్యే కొంతమంది దాతలను సంప్రదించి తనే సొంతగా ఆసుపత్రికి భోజనం అందిస్తున్నాడు.

  విశాఖపట్నంలోని 300 పడకలు గల ఆసుపత్రిలో రోజుకు దాదాపు 100 నుంచి 150 రోగులు ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతుంటారు. వీరికి సహాయకులుగా వచ్చిన బంధువులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. కొందరికి బయట తినే స్థోమత లేక ఆకలితోనే అలమటిస్తూ ఉంటూరు. మంచినీళ్లతో కడుపు నింపుకుంటూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి ప్రతి నిత్యం 150 మందికి ఉచితంగా భోజనం అందిస్తుంటాడు భూమయ్చ. అంటే నెలకు దాదాపు 5 వేల మంది వరకు రోగుల బంధువులకు భోజనం ఏర్పాటు చేస్తున్నట్టే..

  ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే ఇంట్లోవారి సహకారం తప్పని సరిగా ఉండాలి. ఆటో డ్రైవర్ భూమయ్యతో పాటు అతడి భార్య కూడా సరకులు తేవడం, కూరగాయలు తరగడం, వంట చేయడం, వంట పూర్తయిన తరువాత వడ్డించడం లాంటి పనులు చేస్తూ.. భర్త చేస్తున్న సాయంలో సగభాగమవుతున్నారు. వారి పిల్లలు సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. మరికొంతమంది దాతలు సహకరిస్తే నాణ్యమైన ఆహారం అందించగలమని భూమయ్య చెప్తున్నారు.

  భూమయ్యకు అండగా ఒకరిద్దరు శాశ్వత దాతలు ఉండగా.. మరికొందరు పుట్టినరోజులు, పెండ్లిరోజులకు తమకు తోచినసాయం అందిస్తుంటారు. సేవాభావం ఉన్న దాతలెవరైనా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధారాణిని సంప్రదిస్తే ఆమె భూమయ్య దృష్టికి తీసుకెళ్తారు. అలా కొంతమంది సాయం చేస్తుంటారు. ప్రముఖ వ్యాపార వేత్త దివంగత మట్టపల్లి చలమయ్య కుమారులు తమ తండ్రి పేరున బియ్యం బస్తాలు అందిస్తారు. రైతుబజార్లలో భూమయ్య సేవ గురించి తెలిసిన రైతులు తక్కువ ధరకు కూరగాయలు అందిస్తారు. డబ్బులు మరీ అవసరమైతే ఆటో ఎక్కువ ట్రిప్పులు తిప్పి ఆసుపత్రిలోనే వంట చేసి అందిస్తును అంటున్నాడు భూమయ్య.
  Published by:Nagesh Paina
  First published: